ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరి కొన్ని గంటల్లో తుపానుగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 17 కి.మీ. వేగంతో తీరం వైపు తీవ్ర వాయుగుండం కదులుతోందని తెలిపారు. కళింగపట్నంకు 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గోపాల్‌పూర్ - కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. 


తీరం వెంబడి 50 కి.మీటర్ల వేగంతో గాలులు


తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో వాయవ్య-పశ్చిమ బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. 






బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 27న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఒడిశాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తరాంధ్ర తీరంతో పాటు ఒడిశావైపు తీర ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.




తుపాను ముప్పు


ఈ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారి విశాఖ, ఒడిశాలోని గోపాలపూర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముందని పేర్కొంది. ఈ తుపానుకు గులాబ్ అని పాకిస్తాన్ పేరు పెట్టే అవకాశం ఉందని తెలిపింది.





మూడు రోజుల పాటు వర్షాలు


శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే 26న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలుంటాయి. 27న మాత్రం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇప్పటికే తీరప్రాంత వాసులను హెచ్చరించారు.


ఉత్తరాంధ్రపై ప్రభావం


తుపాను వచ్చే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఉత్తరాంధ్ర మత్స్యకారులు బిక్కుబిక్కుమంటున్నారు. గత నెలలో అల్పపీడనాలు, అలల తాకిడితో తీరప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


తుపాను పరిస్థితులపై సీఎం ఆరా


తుపాను పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: Civil Services 2020 Results: సివిల్ సర్వీసెస్ 2020 ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగువారు ఎవరంటే


Also Read: Delhi Tour: సీఎం జగన్ కాలికి గాయం... దిల్లీ పర్యటన రద్దు... దిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్


Also Read: CM Jagan Mohan Reddy: భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్... వైద్య, ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం


Also Read: KTR Vs Vijaisai : ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?