ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్ దేశాల 'క్వాడ్' సదస్సు శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ప్రపంచ దేశాల మేలు కోరే ఓ శక్తిగా క్వాడ్ కూటమి నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదే సుగా పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌లపై చొరవ..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యాక్సినేషన్‌పై క్వాడ్ తీసుకుంటున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యంగా భారత్ ఇందుకోసం మరింత కృషి చేస్తుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు మోదీ స్పష్టం చేశారు.
బైడెన్ కీలక ప్రకటన..
క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. క్వాడ్ దేశాల్లోని విద్యార్థులు.. అమెరికాలో 'స్టెమ్' కార్యక్రమాల్లో అడ్వాన్స్‌డ్ డిగ్రీ విద్యను అభ్యసించేందుకుగాను క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రకటించారు. ప్రపంచ అవసరాల కోసం భారత్‌లో 100 కోట్ల కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి చేసేందుకు క్వాడ్ దేశాలు కృషి చేస్తున్నాయని బైడెన్ తెలిపారు.
సవాళ్లు పరిష్కరించాలి..
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. ఈ ప్రాంతంలో సార్వభౌమ హక్కలకు భంగం వాటిల్లకూడదని క్వాడ్ సదస్సులో తెలిపారు.
దృఢమైన బంధానికి ప్రతీకగా..
క్వాడ్ సదస్సు ముగిసిన తర్వాత మోదీ న్యూయార్క్‌కు పయనమయ్యారు. అక్కడ జరగనున్న 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
Also Read:Modi Biden Meet: మోదీ-బైడెన్ స్నేహగీతం.. బంధం బలోపేతమే లక్ష్యం