AP Weather Updates: ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, నార్త్ రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో కురుస్తున్న వర్షాలతో దక్షిణాది వైపు చల్లని గాలులు వీస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తీవ్రత రోజురోజుకూ తగ్గుతోంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఈశాన్య దిశ నుంచి వీచే గాలులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆగ్నేయం, తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 9 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ వెదర్ అప్‌డేట్..
తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదు. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది కాదని వాతావరణ కేంద్రం సూచించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో రెండు వైపుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం పొడిగా ఉండనుంది.
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో ఏ మార్పులు లేవు. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం కాస్త వేడిగా మారింది. జంగమేశ్వరపురంలో 18 డిగ్రీలు, బాపట్లలో 18.4 డిగ్రీలు, తునిలో 18.6 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 17 డిగ్రీలు, నంద్యాలలో 18.5 డిగ్రీలు, కర్నూలులో 18.6 డిగ్రీలు, అనంతపురంలో 17.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Also Read: Mahesh Babu Covid 19: మహేష్ బాబుకు కోవిడ్-19 పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు