భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు హైదరాబాద్ లో అరెస్టు చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అరెస్టు విషయంలో పోలీసులు షాక్ ఇచ్చారు. వనమా రాఘవేంద్రరావు అరెస్టు చేయలేదని కొత్తగూడెం పోలీసులు ప్రకటించారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. రాఘవ కోసం ఎనిమిది బృందాలు తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తాజాగా వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. వనమా రాఘవపై గతంలో నమోదైన కేసులపై కూడా దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల్లో ఆధారాలు లభిస్తే రాఘవపై రైడీషీట్ నమోదు చేస్తామని ఏఎస్పీ తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే లేఖ
పాల్వంచ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావును హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబంతో పాటు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ అంశాలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖ రాశారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. రాఘవను పోలీస్ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే లేఖ బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ రాఘవను పోలీసులు అరెస్టు చేయలేదని పాల్వంచ ఏఎస్పీ అధికారిక ప్రకటన చేశారు.
సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఏమన్నారంటే..
"కష్టాల్లో ఉన్న నాపై మా అక్క, అమ్మ కక్ష సాధిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన నన్ను రోజూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి తోడు వనమా రాఘవరావు టార్చర్ మరింత ఎక్కువైంది. ఈ సమస్య తీరాలి అంటే నా భార్యను ఆయన పంపించాలన్నారు. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఎవరి వద్ద చెప్పుకున్నా లాభం లేదన్నారు. చెప్పిన పని చేస్తేనే ఏం కావాలో అది చేస్తారట. రాజకీయ, ఆర్థిక బలుపుతో అవతలి వ్యక్తుల బలహీనతలను గ్రహించి ఆడుకుంటున్నాడా వ్యక్తి. ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయాయి. ఈ చీకటి కోణాలకు సాక్ష్యాలు లేవు. ఓ వ్యక్తి సాయం చేయాలంటే తనకు లాభమేంటని చూసుకునే వ్యక్తి రాఘవ. నా సమస్యలో నా భార్యతో లబ్ధి పొందాలనుకున్నారు. వేరే దారి లేక నా భార్య బిడ్డలను రోడ్డున పడేయలేక సూసైడ్ నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో కొంత భాగాన్ని నాకు సహకరించి అప్పులు ఇచ్చిన వారికి చెల్లించండి. మిగిలినది అమ్మ, అక్కకు వదిలేయండి. మరొకరికి అన్యాయం జరగకుండా చూడండి." అని నాగ రామకృష్ణ వీడియో తెలిపారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!