Srikakulam Latest News: ఓటీటీ జమానాలో కూడా నాటకాలకు అభిమానులు తగ్గలేదు. కళాత్మకంగా మంచి విషయం చెబితే చూసేందుకు సిద్ధమని శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని పల్లెలు చెబుతున్నాయి. సినిమా రాకతో మరుగున పడిపోయిన కళను కొంతమంది యువత అభిమానంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కళపై ఉన్న మక్కువ వారిని అలా నడిపిస్తోంది. వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త తరం ముఖానికి రంగులు అద్దేందుకు ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ప్రదర్శనలు మెచ్చుకొని సత్కారాలు చేస్తున్నారు. 


ఆటవిడుపుగా రంగస్థలంపై తమ అభిరుచిని ప్రదర్శిస్తున్న వాళ్లు నాటకరంగానికి కొత్త హంగులు అద్దుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న కళాకారులను గురించి సత్కరిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా నాటక పోటీలు నిర్వహించి కొత్త కళాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అలాంటి నాటక పోటీలు శ్రీకాకుళం జిల్లా అమదాల వలస, బొరివంక గ్రామాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కళాకారులను, నిర్వాహకులను అభినందించారు. బొరివంకలో కళింగ సీమ కళాపీఠం ఆధ్వర్యంలో బల్లెడ అనసూయమ్మ స్మారకార్థం నాటిక పోటీలు నిర్వహించారు.  తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి నాటికలు వేశారు. చివర రోజు ప్రదర్శించిన నాటికలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 


Srikakulam Latest News: ఓటీటీ టైంలో ఆకట్టుకున్న నాటికలు- రంగస్థలంపై మెరుస్తున్న శ్రీకాకుళం జిల్లా పల్లెలు


ఆముదాల వలసలో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్‌మోహన్‌.. నాటక రంగానికి సముచిత స్థానం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో కేవలం నాటకాలతోనే ప్రజలు విజ్ఞానవంతులయ్యే వారని గుర్తు చేశారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి సాంఘిక నాటకోత్సవాలు ఆముదాలవలసలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమారు అభిప్రాయపడ్డారు.


నాటకాలను ప్రదర్శించడం భారమే అయినా సమాజానికి మేలు కలిగించే నాటికలు ప్రదర్శించి కళాకారులు ఔరా అనిపించారు. ప్రభుత్వాలు సహాయపడితే మరింతగా రాణించి సమాజానికి ఉపయోగపడతామని సీక్కోలు కళాకారులు అభిప్రాయపడుతున్నారు.



ఒకప్పుడు వీధి నాటకాలకు ప్రాధాన్యత..


ఊర్లో పండగ ఉంది అంటే చాలు పనులను త్వరగా పూర్తి చేసి ఏడు గంటల నుంచి స్టేజ్ దగ్గర కూర్చునేవాళ్లు. నేటి తరానికి వీటి గురించి పెద్దగా తెలియదు. ఒక గోని సంచెను కింది వేసుకొని కూర్చొని నాటకాలు, డ్రామాలు, తెగ చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా మర్చిపోయారు. పిల్లలకి కూడా ఆ నాటకం అంటే ఏంటో కూడా తెలియదు. ఓటీటీ, సోషల్‌ మీడియా ప్రభావంతో నేటి తరానికి నాటకాలు అంటేనే బోరింగ్‌గా మారిపోయాయి. 


జానపదాల్లో, విప్లవ గీతాల్లో శ్రీకాకుళం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. సమాజిక స్పృహ కల్పించేందుకు, జరుగుతన్న అన్యాయాలను ప్రశ్నించేందుకు కాళ్లకు గజ్జె కట్టిన వారు, ముఖానికి రంగు వేసుకొని ప్రజల ముందుకు వచ్చారు. ఈ కళాకారులే నాడు సమాజానికి దిక్సూచీలుగా మారారు. 


కానీ కాలం మారింది. ప్రజల అభిరుచులు కూడా మారిపోయాయి. ప్రసార మాధ్యమాల్లో మార్పు వచ్చింది. రాకెట్ వేగంతో అన్ని రంగాల్లో మార్పు పరుగులు పెడుతోంది. ఈ మార్పుతో నాటక రంగం మరుగున పడిపోయింది. దీన్నే వృత్తిగా చేసుకున్న రంగస్థల కళాకారులు లేరు. ఇదో ఆటవిడుపుగా మార్చున్న వారు ఇప్పుడు రంగస్థలంపై కనువిందు చేస్తున్నారు. వారే ఈ రంగానికి ప్రాణం పోస్తున్నారు. 


Also Read: చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా`