విశాఖపట్నంలో ఆదివారం ఉదయం జనం ఆందోళన పడే ఘటన చోటు చేసుకుంది. నగరంలో కొన్ని చోట్ల భూకంపం సంభవించింది. కొన్ని సెకెన్ల పాటు భూమి స్పల్పంగా కంపించింది. దీంతో జనం భయాందోళనకు గురై వారి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 7.15 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. భూమి కంపించడంతో పలు చోట్ల అపార్ట్‌మెంట్ భవనాలకు పెచ్చులూడిపడ్డాయి. తాటిచెట్లపాలెం, సీతమ్మధార, అల్లిపురం, అసిల్‌మెట్ట జంక్షన్, అక్కయ్యపాలెం, మధురానగర్, రైల్వే న్యూకాలనీ, బీచ్‌రోడ్, ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.


గోపాలపట్నం, సింహాచలం, అడవి వరంలోనూ భూమి కంపించింది. దీనిపై భూభౌతిక శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రకంపనలకు పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ భూకంపం ఎంత శాతం రిక్టర్ స్కేలుపై నమోదు అయిందో అధికారులు తెలియజేయాల్సి ఉంది. అయితే, కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఫాల్ట్ లైన్ ఉందని.. దాని ప్రభావంతో విశాఖపట్నానికి భూకంపాలు, సునామీ ముప్పు పొంచి ఉందని గతేడాది హెచ్‌సీయూ ప్రొఫెసర్ల అధ్యయనం తేల్చింది. తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలో మీటర్ల పొడవున ఫాల్ట్‌లైన్‌ ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో గతంలో తేలింది.


















Also Read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...


Also Read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి