విశాఖపట్నంలో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. యువతిపై పెట్రోలు పోసి తాను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. చివరికి స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు విశాఖకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు స్థానికులను షాక్‌కు గురి చేశాయి. హోటల్ స్టాఫ్, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి వారిద్దరిని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ రెడ్డి అనే 21 ఏళ్ల యువకుడు, విశాఖపట్నం నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి పంజాబ్‌లోని ఓ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది.
అనంతరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను విశాఖకు వచ్చిన విషయం చెప్పడంతో ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన హర్షవర్ధన్ రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు.. తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. హర్షవర్ధన్ రెడ్డి ఒళ్లు 62 శాతం కాలిపోయినట్లుగా వైద్యులు గుర్తించారు. ఆ యువతికి 61 శాతం కాలిన గాయాలు అయ్యాయి.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన పరిణామం, ఆయన్ను చంపింది అందుకే.. వెనుక బడా నేతలు..
క్లూస్ టీంతో పోలీసులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. వారిద్దరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరని, దర్యాప్తులో పురోగతి వచ్చే వరకూ కచ్చితమైన సమాచారం చెప్పలేమని విశాఖపట్నం పోలీసులు వెల్లడించారు.
హర్షవర్ధన్ రెడ్డి కుటుంబం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. తండ్రి రాం రెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గత సంవత్సరమే ఇతను బీటెక్ పూర్తి చేశాడు. ఇతను హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం రాత్రి విశాఖకు బయలుదేరి వెళ్లారు. చదువులో ముందుండే హర్షవర్ధన్ రెడ్డి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు.
Also Read: వార్నీ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలో హుండీని ఎత్తుపోయాడు, వీడియో వైరల్