Vizag Cruise Ship: విశాఖపట్నం టూరిజంలో మరో కొత్త ఎట్రాక్షన్ చేరనుంది. నగర వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ క్రూయిజ్ సేవలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. 11 అంతస్తుల  భారీ క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ వైజాగ్‌కు రానుంది. జూన్ 8 న మొదటి ప్రయాణం ప్రారంభం అవుతుంది. దీనిలో 1800 మందికి పైగా టూరిస్టులు ప్రయాణం చెయ్యొచ్చు. జూన్ 8 ఉదయం 7 గంటలకు వైజాగ్ చేరుకునే షిప్.. అదేరోజు సాయంత్రం 6 గంటలకు బయలుదేరనుంది. ఒకరోజు ప్రయాణం తరువాత జూన్ 10 న ఉదయం పుదుచ్చేరి చేరుకుంటుంది. ప్రయాణికులకు అక్కడి పర్యాటక ప్రదేశాలు చూపించాక ఆ రాత్రి 8 గంటలకు బయలుదేరి 10వ తేదీ ఉదయం చెన్నై చేరుకోనుంది ఈ భారీ క్రూయిజ్.
గతంలో అండమాన్ నుండి రెండు మూడు నెలలకోసారి వచ్చే షిప్పు మాత్రమే వైజాగ్ కు అందుబాటులో ఉండగా ఇప్పడు చైన్నైకి డైరెక్ట్ క్రూయిజ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని నడుపుతున్న జేయం భక్షీ అనే సంస్థకు వైజాగ్ పోర్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడంతో టికెట్ బుకింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే 600లకు పైగా టికెట్స్ కేవలం వైజాగ్ నుంచి బుకింగ్ పూర్తయ్యాయి. 


క్రూయిజ్ షిప్పు లో ప్రయాణం ఓ మరపురాని జ్ఞాపకం :
క్రూయిజ్ షిప్పులను సముద్రంలో తేలియాడే సిటీగా చెప్పొచ్చు. క్రూయిజ్ షిప్పులో స్విమ్మింగ్  పూల్స్, కేసినోలు, ఫిట్ నెస్ సెంటర్లు, సినిమా థియేటర్, బార్లు ,సెలూన్లు, లైవ్ ఎంటర్టైన్‌మెంట్ షోలు, అడ్వెంచరస్ స్పోర్ట్స్, రెస్టారెంట్స్ ఇలా ఒకటేమిటి.. ఒక్క ప్రయాణంలోనే ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ ఒక్క నెలలోనే 15, 22 తేదీల్లో ఈ భారీ టూరిస్ట్ షిప్ వైజాగ్ నుండి బయలుదేరనుంది. 


వివిధ ధరల్లో రూము లు బుక్ చేసుకోవచ్చు
ఈ షిప్‌లో స్టే రూమ్ ధర సుమారు 25000, సముద్రాన్ని వీక్షించే సౌకర్యం ఉన్న రూమ్ ధర రూ.30000. మినీ సూట్ రూ.53,700 గా ఉంది. పిల్లలకు మాత్రం ఈ రూమ్ అయినా రేట్ రూ.8732 గా ఉంది. ఈ షిప్పులో, మొత్తం అన్ని రూములు కలిపి 796 ఉన్నట్టు పోర్ట్ అధికారులు చెబుతున్నారు.


త్వరలో గోవా, శ్రీలంక, ముంబైలతో పాటు విదేశాలకూ వైజాగ్ నుండి షిప్‌లు
ప్రస్తుతం వైజాగ్ పోర్టులో ఇలాంటి భారీ క్రూయిజ్ షిప్పులు ఆగడానికి వీలుగా ఒక క్రూయిజ్ టెర్మినల్ రూ. 98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈ టెర్మినల్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి అది రెడీ అయిందంటే చెన్నైతో పాటుగా గోవా, ముంబై, శ్రీలంకలతో పాటు ఇతర దేశాలకు చెందిన భారీ క్రూయిజ్ షిప్పులు కూడా వైజాగ్ కు వస్తాయని పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు చెబుతున్నారు. 


వైజాగ్ టూరిజం డెవలప్మెంట్ మరింత వేగం  
మొత్తమ్మీద విశాఖతో పాటు ఏపీ వాసులు ఎదురుచూస్తున్న క్రూయిజ్ టూర్ అనుభూతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల వైజాగ్ టూరిజం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అధికారులు ఆశలు పెట్టుకున్నారు.


Also Read: YS Jagan Returns AP: దావోస్ నుంచి తిరిగొచ్చిన సీఎం వైఎస్ జగన్, ఘన స్వాగతం పలికిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ


Also Read: Nellore: తినేందుకు తిండి లేదు గానీ ఇదేం సరదానో! పీవీ, వైఎస్ఆర్‌లతోనే ఢీ - ఇప్పుడు మళ్లీ అలాంటి పనే