Parawada Latest News: విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఠాగూర్ లేబొరేటరీస్‌ ఫ్యాక్టరీలో విషవాయువులు  లీక్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 


పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం అర్థరాత్రి విషవాయులు లీక్ అయ్యాయి. ఈ దుర్ఘటనలో పది మందికిపైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 




ఘటన జరిగిన వెంటనే బాధితులను కిమ్స్ ఐకాన్‌కి తరలించారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. విషమంగా ఉన్న వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరికి చికిత్స అందిస్తున్నారు.  


క్షతగాత్రులు ఒడిశాకు చెందిన వారుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు చెప్పేందుకు ఠాగూర్ పరిశ్రమ యాజమాన్యం నిరాకరిస్తోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ స్పందించడం లేదు. 




ఏదోలా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పరిశ్రమకు వెళ్లి విచారణ చేపట్టారు. ఏం జరిగిందో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


నెలలో రెండో ప్రమాదం 


పరవాడ ఫార్మా సిటీలోని ఈ నెలలో ఇది రెండో ప్రమాదంలో నవంబర్‌ 2 శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాల పాలయ్యారు. మెట్రో కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అక్కడ పని చేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. అయినా ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  


ఆగస్టులో నలుగురు మృతి 


ఆగస్టులో కూడా భారీ ప్రమాదం జరిగింది. ఆగస్టు 22న సినర్జిన్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒకరు విజయనగరం వాసి కాగా.... మిగతా వాళ్లు వేర్వే రాష్ట్రాలకు చెందిన వాళ్లు. ఈ ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలా చాలానే జరిగాయి. ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు మృతి చెందారు. 


జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆగని ప్రమాదాలు 


ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం, స్థానిక అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అయినా కొన్ని యాజమాన్యాల నిర్లక్ష్యంగా కారణంగా తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు చనిపోతున్నారు. 


చిన్న చిన్నవి బోలెడన్ని 


ప్రమాద తీవ్రత భారీగా ఉన్నప్పుడు మీడియా అటెన్షన్ ఉంటోంది. ప్రమాదాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ చిన్న చిన్నవి జరుగుతున్నప్పుడు కేసులతో సరిపెడుతున్నారు. బాధితులకు న్యాయం జరగడం లేదని ఫార్మా ఉద్యోగులు వాపోతున్నారు. గ్యాస్ లీకేజీలు, ఇతర ప్రమాదాలు ఇక్కడ నిత్యకృతమైపోతున్నాయని కొన్ని అసలు బయటకే రావడం లేదని అంటున్నారు. గతంలో నియమించిన మానిటరింగ్ కమిటీలు యాక్టివ్‌గా పని చేయాలని, ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 


Also Read: ఎయిర్‌పోర్టు పనులతో పలాసకు మహర్దశ - మా భూములు ఇచ్చేది లేదంటూ రైతుల ఆందోళన