Airport In Palasa News | పలాస నియోజకవర్గంలో నూతన ఎయిర్‌పోర్ట్ ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుచోట్ల స్థలాన్ని పరిశీలించి ఎయిర్ పోర్ట్ అథార్టీకి ప్రాథమికంగా నివేదికను అందజేశారు. ఈ మేరకు రెండు రోజులపాటు అధికారుల బృందం పర్యటించి పరిశీలిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర బృందానికి ఆర్డీవో స్థలాలను చూపించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం తెలిసిందే.
ఈ మేరకు ఎయిర్పోర్టుకు చెందిన బృందం రావడంతో పలాస ఆర్డీవో జి. వెంకటేశ్వరరావు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాలను పరిశీలించారు. ఎయిర్ పోర్టుకు 1383.71 ఎకరాల విస్తీర్ణం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో 295.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రైతుల నుంచి 1088.58 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ఎయిర్ పోర్ట్ అధికారులకు వివరించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. మందస మండలంలో బిడిమి, బేతాళపురం, టి. గంగువాడ, వజ్రపుకొత్తూరు మండలంలోని చీపురపల్లి, మెట్టూరు ప్రాంతాలను ఎయిర్ పోర్ట్ అధికారులు సందర్శించి క్షేత్ర స్థాయిలో మట్టి, సముద్రతీరం, జాతీయ రహదారి ఇతరత్రా అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రంలో మరో ఐదుచోట్ల ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి తగిన సూచనలు ఇచ్చారని అధికారులు స్థానికులతో ముచ్చటించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించిన బృందం రెవెన్యూ అధికారులతో చర్చించారు. జియాలజిస్టులు కూడా ఈ బృందంతో పాటు ఉన్నారు. ఈ మినీ ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉద్దానం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్ధానం రూపురేఖలు మారతాయా?
మూలపేట పోర్టు నిర్మాణం, ఇటు ఎయిర్ పోర్టు పూర్తి చేస్తే ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో గల ఉద్దానం ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. తద్వారా స్థానికుల తలరాత మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టు సన్నాహాల్లో మహర్దశ పట్టనుందని ఆర్డీవో వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో ఇదివరకే నిర్ధారించిన స్థలాన్ని ఈ బృందానికి చూపించినట్లు తెలిపారు. సాధ్యసాధ్యాలపై వారు నిర్ణయం తీసుకుంటారని, స్థానికులు కూడా పోర్టు నిర్మాణానికి సహకరించాలన్నారు.
మాకొద్దు ఎయిర్‌పోర్ట్.. ఉద్ధానంలో విమానాశ్రయ వ్యతిరేఖ పోరాటం
పలాస నియోజకవర్గం మందస మండలం బేతాళపురం బిడిమి లక్ష్మి పురం వజ్ర కొత్తూరు మండలం చీపురుపల్లి మెట్టూరు ఈ రెండు ప్రాంతాల్లో రెండు ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ అంశంపై ఆదివారం పలాస సూది కొండ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులు మాట్లాడారు. ఎయిర్పోర్ట్ లకు 1400 ఎకరాలు భూసేకరణ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఎయిర్‌పోర్టులు ఎందుకు వస్తున్నాయి, ఇవి అభివృద్ధి కొరకేనా, దీని ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఉద్దానం ప్రజలకు ఎయిర్పోర్ట్ వలన ఏం ఉపయోగం ఉంటుందన్న చర్చ మొదలైంది.
వాణిజ్య పంటలు పండుతున్నచోట 1400 ఎకరాలు ఎయిర్ పోర్ట్ కోసం సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలతో కూడిన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా భూమిని గుర్తించి మార్కింగ్ చేయడం సరైన పద్ధతి కాదు వెనకబడ్డ ప్రాంతం ఉద్దానం అభివృద్ధి చేయాలంటే పరిపరిశ్రమలు కావాలి. ఆ పరిశ్రమలు కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలై ఉండాలి. విదేశాలలో నిషేధం ఉన్న అన్ని ప్రాంతాల్లో కాదనే పరిశ్రమలు పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమలు ప్రజలు ప్రాణాల్ని హాని కలిగించే పరిశ్రమలు ఈ ప్రాంతంలోకి ఎందుకు తెస్తున్నారని స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్ లు తీసుకొచ్చారు. అప్పుడు జరిగిన పోరాటంలో ఆరుగురు మరణించారు ఇప్పటికే ఆ జీవోలు రద్దు లేదు విధ్వంసం వినాశనం చేసే వాటికి అభివృద్ధిని పేరు తగిలిస్తున్నారు.
Also Read: AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
కోస్టల్ కారిడార్‌లో భాగంగా తీర ప్రాంత భూములు లక్షలాది ఎకరాలు సేకరణ చేస్తున్నారు. దీని వెనక ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అప్పుడు కూడా ఈ ప్రాంతం మీద దృష్టి సారించారు. అయితే ఇక్కడ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం వెనక ఎవరు ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు కోరారు.