Srikakulam News: శ్రీకాకుళంజిల్లాలో రైతులను ఓవైపు తుపానులు బెదరగొడుతుంటే... మరోవైపు అడవి పందులు అదరగొడుతున్నాయి. పండించిన పంట చేతి వరకు వస్తుందో లేదో అన్న బెంగ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో ఈ ఏడాది 42 వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ప్రధానంగా సోంపేట మండలంలోని పలాసపురం, బారువ, బెంకిలి, బేసిరామచంద్రాపురం, కంచిలి మండలంలోని గొల్లకంచిలి, బూరగాం, శాసనాం, కవిటి మండలంలోని మాణిక్యపురం తదితర గ్రామాల్లో అడవి పందులు బెడద ఎక్కువగా ఉంది. దీంతో పలువురు రైతులు పంటలను రక్షించాలని గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు అందజేస్తున్నారు. నాలుగు మండలాల్లో ఏటా అడవి వల్ల 15 నుంచి 30 శాతం వరకు పంట నష్టం జరుగుతోందని వాపోతున్నారు.
అటవీ వందులు స్వైరవిహారం..
ఉద్దానంలోని రైతులను అటవీ పందులు కంటి మీద కునకు లేకుండా చేస్తున్నాయి. వరి పంట చేతికివచ్చిన సమయంలో గుంపులుగా పందులు పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. ఈ పందుల బారి నుంచి వంటను రక్షించుకోవడానికి రైతులు పొలాల చుట్టూ పరదాలు కట్టి, సీసాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు రాత్రి వేళల్లో కాపలా ఉంటున్నారు.అడవి పందుల వల్ల వరి రైతులకు జరుగుతున్న నష్టాల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
సినిమా విలన్ ఫోటోల ఏర్పాటు
విజయనగరం జిల్లా, రేగిడి మండలం, ఒప్పింగి గ్రామానికి చెందిన గంట మోహన్ రావు తను పండించే పైరు జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. సినిమాల్లో విలన్ లను తన పంట పొలాలకు కాపలా ఉంచాడు. ఈ విలన్ల లిస్టులో టాలీవుడ్ వారే కాదు హాలీవుడ్ విలన్లు కూడా ఉండడం విశేషం. ప్రతిఘటనలో నటించిన రామిరెడ్డి, యుముడి గెటప్‌లో ఉన్న కైకాల సత్యనారాయణ, బాహుబలిలో కట్టప్ప, రోబో సినిమాల్లో పక్షిరాజు అవతార్ తదితర సినిమాల్లో విలన్ల ఫోటోలు పెద్ద పెద్ద పెక్లీలుగా వేసి పొలాల్లో ఉంచాడు.
ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను రక్షించుకునేందుకు ఆ అన్నదాత ఆలోచన తీరును అటుగా వెళ్లే వారందరూ చూసి ముచ్చట పడుతున్నారు. నీవు సూపర్ అన్నా అంటూ అభినందిస్తున్నారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి తుపానులు ఓవైపు ఊడ్చేస్తుంటే మరోవైపు ఈ అడవి జంతువులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పంటను రక్షించేందుకు వ్యవసాయ, ఆటవీ శాఖాధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. అడవి పందుల నియంత్రణ అవసరమైన యంత్ర పరికరాలు సమకూర్చడం లేదని అంటున్నారు. ఇప్పటి వరకు చేప్పినవి కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు సంఘాలుగా ఏర్పాటు చేసి సోలార్ ఫెన్సింగ్ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Also Read: ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
అధికారులు తీసుకోవడం లేదు కాబట్టి పంటను కాపాడుకునేందుకు సంప్రదాయ పద్ధతులపై ఆధారపడుతున్నామని రైతులు చెబుతున్నారు. సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేస్తే అడవి పందుల బెడద తప్పుతుందని రిక్వస్ట్ చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఎకరా పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు లక్షకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం చిన్న రైతులకు అవసరమైన సోలార్ ఫెన్సింగ్ సబ్సిడీపై అందించాలని పలువురు కోరుతున్నారు.