Chandra Babu Govt Latest News Today: ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచి ఈ రోజుకి సరిగ్గా ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల్లో తమది చాలా మంచి ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి ఎక్కువగా సాధించగలుగుతున్న నిధులు, విజయవాడ వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, కూటమిలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లడం వంటి ఎన్నో పాజిటివ్ అంశాలు ఏపీ ప్రభుత్వం వైపు ఉన్నాయి. అందుకే సీయం చంద్రబాబు నాయుడు పదేపదే తమది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఆయన మాటెలా ఉన్నా ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో కూటమికి రికార్డు స్థాయిలో 164 సీట్లు కట్టబెట్టారు. మరి ఈ ఆరు నెలల్లో వారి ఆశలకు తగ్గట్టుగా పాలన సాగించిందా లేదా.. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్లస్సులేంటి మైనస్సులేంటి ఇప్పుడు చూద్దాం..!
1) ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు -ప్రజలకు ఊరట
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే కచ్చితంగా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా జనంలోకి మాత్రం అది తమ భూములపై అజమాయిసీ చేయడానికి మాత్రమే అనే ఫీలింగ్ చాలా బలంగా వెళ్లిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి ఆ మాట నిలబెట్టుకుంది. ఇది కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
2) అన్న క్యాంటీన్ల రీఓపెన్
2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 'అన్న క్యాంటీన్ల'పై కొన్ని విమర్శలు ఉండేవి. ఇది డబ్బు దుబారా చేయడమే అన్నట్టు చాలామంది భావించారు. కానీ కొవిడ్ సమయంలో వీటి అవసరం చాలా తెలిసొచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్స్‌కి వచ్చే రోగులు, వారి బంధువులు, దూర ప్రాంతం నుంచి పట్టణాలకి బతుకుదెరువు కోసం వచ్చే నిరుపేదలు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. తక్కువ రేటుతో వాళ్లు కడుపు నింపుకోగలుగుతున్నారు. ఒక ధార్మిక సేవా సంస్థతో కలిసి ప్రభుత్వం నడిపిస్తున్న అన్న క్యాంటీన్లు కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరే తెచ్చిపెట్టాయి.
3) ఇసుక పాలసీలో మార్పులు చేసిన చంద్రబాబు సర్కార్
గత ఐదేళ్లలో సామాన్యుడు ఇబ్బంది పడిన అంశాల్లో ఒకటే ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడం. ఒక పక్క రేట్లు పెరిగిపోయి మరోవైపు ఇసుక దొరక్క మధ్యతరగతి ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ఒకపక్క రివర్స్ టెండరింగ్‌తో ఇసుక కొనుగోలులో డబ్బు అదా అవుతుందని అప్పటి ప్రభుత్వం చెబుతుంటే రేట్లు ఇసుక రేట్లు ఎలా పెరిగిపోయేవో కామన్ మేన్‌కు అర్థమయ్యేది కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత విధానాన్ని రద్దు చేసింది. ఇసుక ఫ్రీగా ఇస్తాం కానీ రవాణాచార్జీలు మాత్రం కట్టుకోవాలి అని ప్రభుత్వం చెప్పడంతో గతంతో పోలిస్తే తక్కువ రేటుకే ఇసుక లభిస్తుంది. అయితే ఈ రవాణాచార్జీల విషయంలో అవినీతి జరుగుతుందంటూ విమర్శలు రావడంతో దానిని ఆన్లైన్ విధానంగా మార్చాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విధానం ఎంతవరకు పారదర్శకంగా ఉందో తెలియాలంటే మరి కొంత సమయం పడుతుంది.
4) ఐదేళ్ల తర్వాత రాజధానిపై స్పష్టత
ఐదేళ్లకోసారి తరం మారుతుంది. ఐదేళ్ల క్రితం టెన్త్ పూర్తయిన స్టూడెంట్ ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీలో ఉంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా మీ రాజధాని ఏది అంటే ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానితో జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రయోగం ప్రజామోదం పొందలేదు సరికదా గత ఎన్నికలల్లో అదొక రిఫరెండంగా మారిపోయింది. జగన్ తన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనుకున్న ఉత్తరాంధ్రలోనూ ఆయన పార్టీని ప్రజలు తిరస్కరించారు. దానితో 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని స్పష్టం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రుణాన్ని సంపాదించగలిగింది కూటమి ప్రభుత్వం. నేటి నుంచే ఆ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతుల్లో కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూల ధోరణి ఉంది.
5) ప్రజలకు టచ్‌లో ఉంటున్న కీలక నేతలు
సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కీలక నేతలందరూ ఏదో ఒక విధంగా ప్రజలతో కలిసే ఉంటున్నారు. ప్రెస్మీట్ల రూపంలో కావచ్చు, ప్రజా దర్బార్ పేరుతో కావచ్చు, లేదు విరివిగా చేస్తున్న పర్యటనలు కావొచ్చు నాయకులు జనంలో తిరుగుతున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లోకి బానే వెళ్ళింది. చివరికి పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ సైతం వరుస టూర్లతో జనంలో ఉంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరుగుతూనే తన నియోజకవర్గమైన పిఠాపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అక్కడి జనం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం ప్రజా దర్బార్ పేరుతో ప్రజల్ని డైరెక్ట్ గా కలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి.
6) రోడ్లకు మరమ్మతులు
ఏ నాగరికత ముందుకు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం చాలా ముఖ్యమైనది అని చరిత్ర చెబుతోంది. గత ఐదేళ్లు సంక్షేమ పథకాల పేరుతో డబ్బును ప్రజలకు పంచిపెట్టిన ప్రభుత్వం రోడ్ల విషయంలో అంతగా పట్టించుకున్న సంఘటనలు కనపడలేదు. మంత్రులను ఎమ్మెల్యేలను అడిగితే డబ్బులు ఎక్కడివని సమాధానం వచ్చేది. ఎలక్షన్ల ముందు రోడ్లు సరిచేసే ప్రయత్నం జరిగినా అప్పటికే అవ్వాల్సిన ఆలస్యం అయిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 900 కోట్లతో రోడ్ల గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తుంది. సంక్రాంతి నాటికల్లా రాష్ట్రంలోని రోడ్లను ఒకదారికి తెస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అయితే రాష్ట్రంలోని కీలక పట్టణాల గుండా వెళ్లే 18 రహదారులు గుర్తించి అభివృద్ధి చేసి వాటికి టోల్ గేట్లు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తామని తెలిపారు చంద్రబాబు. దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సింది.
Also Read: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
మైనస్ లు
1) సూపర్ సిక్స్ ల అమలులో జాప్యం
ఎన్నికల సందర్భంగాటిడిపి జనసేన ఇచ్చిన కీలక హామీలు 'సూపర్ సిక్స్ '
1) ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
2) ప్రతి మహిళకు నెలకు 1500
3) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
4) నిరుద్యోగ యువతకు 3000 భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు
5) ప్రతీ రైతుకు ఏడాదికి 20వేల ఆర్థిక సాయం
6) స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది కి 15000
ఈ ఆరు పథకాలలో ప్రస్తుతానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రమే అమల్లోకి వచ్చింది. మిగిలిన ఐదు హామీల్లో స్పష్టత లేదు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
2)పోలవరంపై తగ్గిన స్పీడ్
పవర్‌లోకి వచ్చిన వెంటనే పోలవరం పనులు వేగవంతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించింది. అయితే పూర్తిగా ఆర్థికపరమైన విషయం కావడంతో మొదట్లో కనిపించిన స్పీడ్ ప్రస్తుతం తగ్గిందనే ఫీలింగ్ జనంలో ఉంది. అయితే ఇతర రాష్ట్రాలతో ముడిపడిన అంశాలు, వర్షాలు, డయాఫ్రమ్ మొదటి నుంచి కట్టుకొని రావాల్సిన పరిస్థితి ఎదురవడంతో పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోవడానికి మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు
3) కలవరపెడుతున్న క్రైమ్ సంఘటనలు
రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ ఘటనలు సామాన్య జనాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళపై జరిగిన కొన్ని అత్యాచార ఘటనలు, సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకోల విషయంలో ఏకంగా ఉపముఖ్యమంత్రి పవన్ హోం శాఖపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయి నెట్వర్క్ పై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం,పోలీస్ శాఖ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిపారు. ఒక "ఈగల్ టీం" ని ఏర్పాటు చేస్తూ గంజాయి డ్రగ్ రాకెట్స్ అరికట్టబోతున్నట్టు చెప్పారు.
4) పాలనపై మిస్ అవుతున్న పట్టు
సాధారణంగా చంద్రబాబు పాలనంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా స్ట్రిక్ట్ గా ఉంటుందని పేరు. అయితే ఈమధ్య సీఎం నుంచి మంత్రుల వరకు అధికారులు ఇంకా గత ప్రభుత్వ మత్తులోనే ఉన్నారని కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆరు నెలలైనా ఇంకా పాలన పట్టు చిక్కలేదా అనే చర్చసామాన్య జనంలోకి వెళుతోంది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: 104 ఉద్యోగులపై ఎస్మా - ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం, ఎస్మా అంటే ఏమిటి?