Srikakulam News: చీపురును లక్ష్మీ దేవితో కొలుస్తారు. మిగతా వాళ్ల సంగతి పక్కన పెడితే సంతబొమ్మాళి మండలం సీతానగరంలో మాత్రం నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోందీ చీపురు. మహిళలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఏజెన్సీ గ్రామంకాకపోయిన చీపుళ్ల పరిశ్రమగా మారిపొయింది సీతానగరం గ్రామం. 


సీతానగరం వాసి బత్సల ధనలక్ష్మి కొండ చీపుళ్ల తయారీ నేర్చుకున్నారు. తయారీని నేర్చుకున్న ఆ మహిళ సొంతిట్లోనే తయారు చేసి ఇరుగు పొరుగు వాళ్లకు ఇచ్చే వాళ్లు. బాగున్నాయని చెప్పి ఈనోటా ఆ నోటా పరుగు ప్రాంతాలకు వ్యాపించింది. అంతే ఆర్డర్లు రావడం మొదలు పెట్టాయి. దీంతో కుటీర పరిశ్రమలా చేసుకొని విస్తరించడం మొదలు పెట్టారు ధనలక్ష్మి. 


పది మందికి చీపుళ్ల తయారీ నేర్పించి వ్యాపారం మొదలు పెట్టారు. స్వశక్తిపై జీవిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆ మహిళల స్వయం సహాయక సంఘాల రుణాలు, స్త్రీ నిధి రుణాలతో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. 


గ్రామంలో 280 కుటుంబాలు ఉండగా ప్రస్తుతం 70కుపైగా కుటుంబాల మహిళలు చేతివృత్తిలా నిత్యం చీపుళ్ల తయారీనే చేస్తుంటారు. ఒక చీపురు ధర రూ.100 నుంచి 150 వరకు పలుకుతుంది. రోజుకు ఐదు నుంచి పది చీపుళ్ల సులువుగా కట్టి ఖర్చులు పోను రూ.800 పైబడి సంపాధిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100 మందికిపైగా చీపుళ్ల తయారు చేస్తున్న మహిళలు ఉన్నారు. వీరు తయారు చేసిన చీపుళ్ల మంచి ఆకర్షణగా, నాణ్యతగా ఉండడంతో బయట మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. వీటిని మన జిల్లాతోపాటు, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేస్తుంటారు.


సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమ కాబట్టి బయట నుంచి అప్పులు తెస్తే ఆర్థిక భారం అవుతుంది. కనుక ఈ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా సంఘాలు, స్త్రీనిధి రుణాలను అవసరమైనపుడు అందించి పరిశ్రమకు మరింత సహకారం అందించవచ్చని అంటున్నారు ధనలక్ష్మి. తయారైన ఉత్పత్తులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే మరింత ఉపయోగం అంటున్నారు. 


Also Read: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు


ఒకరితో మొదలై.. సీతానగరం ఊరంతా
బత్సల ధనలక్ష్మి ఉపాది ఇవ్వండంతో ఆ గ్రామస్తులంతా ఆమెను మా ఇంట మహాలక్ష్మి అని ముద్దుగా పిలుస్తారు. పన్నెండేళ్ల కిందట బతుకుతెరువు కోసం అండమాన్‌ వలస వెళ్లగా అక్కడ ఉపాధి నిమిత్తం పలు ప్రాంతాల్లో తిరిగి ఒక కుటీర పరిశ్రమలో మూడు నెలలపాటు చీపుళ్ల తయారీ నేర్చుకుననారు. అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చి చీపుళ్లతోనే జీవనాధారం పొందడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భర్త సోమేశ్వరరావు ప్రోత్సాహంతో సొంత గ్రామంలోనే పరిశ్రమ ఏర్పాటు చేశానంటున్నారు.


మొదట్లో కాస్త పెట్టుబడి పెట్టి శ్రీముఖలింగం, మెళియాపుట్టి ప్రాంతాల నుంచి కుంచె, నార, తాడును తెచ్చి చీపుళ్లు కట్టేవాళ్లు. అది చూసిన చుట్టుపక్క మహిళలు ఆసక్తితో ఆమె ఇంటికి వెళ్లి చీపుళ్లు కట్టడం నేర్చుకోవడంతో వ్యాపారంగా మారింది. అనతికాలంలోనే ఆ చీపుళ్లుకు మంచి గిరాకీ లభించింది. దీంతో ఈ కుటీర పరిశ్రమ ఎంతో మందికి జీవనాధారంగా మారింది. అండమాన్‌లో ఒక కుటీర పరిశ్రమలో చీపుళ్లు తయారీ ఇపుడు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడడం ఆనందంగా ఉందని ధనలక్ష్మి చెబుతున్నారు. 


Also Read: శ్రీకాకుళంలో ఇసుకాసురల ఆటకట్టించిన అధికారులు- జిల్లా వ్యాప్తంగా దాడులు చేయాలని ప్రజల విజ్ఞప్తి