YSRCP News: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 2027లోనే ఎన్నికలు జరగనున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలంటూ ఆయన వైజాగ్‌లో సూచించారు. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభత్సవం సందర్భంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కు పెట్టారు. 


జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ 2029లోనే ఎన్నికలు ఉంటాయని శనివారం చంద్రబాబు మీడియాకు తెలియజేశారు. దీనికి కౌంటర్‌గానే ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికలు అమలులోకి వస్తాయని అందుకే ఆంధ్రప్రదేశ్‌కు 2027లోనే ఎన్నికలు వస్తాయని అన్నారు. పార్టీ నేతలంతా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజల తరపున పోరాటాలు చేయాలని సూచించారు. 


వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతి మూడు స్థానాల్లో ఒక సీటు మహిళలకు కేటాయిస్తారని వివరించారు.మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వైసీపీలో మరింత ప్రయార్టీ ఉంటుందని తెలిపారు. అందుకే ప్రజల్లో ఉండి నిత్యం వారి సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. ప్రభుత్వం తీరును ఎండగట్టాలన్నారు.  


Also Read: 'ఆడబిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలు' - ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు


ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందన్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించారని అందుకే ఈ మధ్య వైసీపపీ రైతు పోరాటానికి మంచి స్పందన లభించిందని గుర్తు చేశారు.  


మొన్న ఎదురైన ఓటమి గురించి ఆలోచించ వద్దన్నారు విజయసాయి రెడ్డి. రేపు వచ్చే విజయాన్ని మాత్రమే చూడాలన్నారు. ప్రతి కార్యకర్త, నేతకు ప్రాధాన్యత ఉంటుందని వారిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. దేశంలో ఏ పార్టీ చేయనట్టుగా ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేశామని ఆ విషయం ప్రజలకు ఇప్పటికీ గుర్తు ఉందని తెలిపారు. 


మిగతా నేతలు మాట్లాడుతూ... చంద్రబాబు ఆరు నెలల్లో 72 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఇందులో సంక్షేమానికి ఖర్చు పెట్టింది చాలా తక్కువని ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై వేశారని మండిపడ్డారు. అందుకే విద్యుత్ చార్జీలు పెంపుపై 27న జరిగే ఆందోళన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని  పిలుపునిచ్చారు. 


Also Read: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు