Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన దొంగనోట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. దీని కోసం ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసి విషయంపై ఆరీ తీస్తున్నారు పోలీసులు. ఈ ఛేజింగ్‌లో గాయపడిన  లావేరు మండలం ఎస్సై జి. లక్ష్మణరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడైన రాపాక ప్రభాకర్ అనుచరుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  


అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రభాకర్‌తో సన్నిహత సంబంధాలు ఉన్న వ్యక్తులను వెతుకుతున్నారు. మూడు రోజుల క్రితం ఏపీ 30 ఏజీ 5700 నెంబరు గల ఐ-20 కారులో ఎన్ని రాజేష్, గణగళ్ల రవికుమార్‌ను దొంగనోట్లతో చిక్కారు. వీళ్లను డ్రిల్ చేసి సూత్రధారులపై కూపీ లాగారు.  వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఉభయ గోదావరి జిల్లాలకు లావేరు ఎస్ఐ లక్ష్మణ రావు ఆధ్వర్యంలో బృందం వెళ్లింది. 


మొత్తం మాఫియాను కూకటివేళ్లతో పెకిలించాలని పోలీసులు భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే పోలీసుల వాహనాలను ముఠా సభ్యులు వెంబడించారు. ఇటీవల రాజేష్‌తోపాటు ఆయన మిత్రులు కొందరు ఈ కారును ఎప్పటికప్పుడు తమ అవసరాల కోసం వినియోగిస్తున్నారట. రాజేష్, రవి పోలీసులు అరెస్టు చూపించారు. కోర్టులో  హాజరుపరిచారు. వీరిని పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. తద్వారా మరింత సమాచారాన్ని రాబెట్టవచ్చని పోలీసులు యోచిస్తున్నారు. 



ఇప్పటికే ప్రాథమిక విచారణలో రాజేష్ కొందరి పేర్లు చెప్పారట. చాలాకాలం నుంచే దొంగ నోట్లను తరలిస్తూ ఈ పనినే వృత్తిగా మార్చుకున్నారని సమాచారం. ఎన్నికల ముందు జిల్లాలోని నరసన్నపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దొంగ నోట్లను ఈ ముఠా చెలామణి చేసినట్టు ప్రచారం సాగుతోంది. దీని వెనుక మరికొందరు సూత్రధారులు ఉన్నారని, వారు కూడా శ్రీకాకుళం నగరానికి చెందిన వారేననిసమాచారం. 


రవి, రాజేష్‌ను పట్టుబడ్డ తర్వాత వారిని విడచిపెట్టేయాలని తర్వాత రోజు కొందరు సన్నిహితులు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారం చాలా పెద్దదని, ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, ఎవరూ తలదూర్చినా ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో వాళ్లంతా వెనుదిరిగారట. 


రాజేష్ మిత్రులతోపాటు నగరానికి చెందిన ఓ రౌడీ షీటర్ ప్రమేయం ఈ వ్యవహారంలో కీలకమని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై కొంత డేటాను సేకరించి ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదికను అందించాయట. సాంకేతిక ఆధారంగా పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. రాజేష్, రవికి ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి తీసుకునేటప్పుడు వీరితో ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరికి ఈ నకిలీ నోట్లను ఇవ్వాలని భావిస్తున్నారన్న కోణాల్లో పోలీసు దర్యాప్తు ముందుకెళుతోంది.



అనేక ఆరోపణలు..


జర్నలిస్ట్‌గా చెలామణీ అవుతున్న రాజేష్‌పై అనేక ఆరోపణలున్నాయి. అతను నడిపే పత్రిక వేరేవారి పేరు మీద ఉంది. నగర పరిధిలో ఎక్కడ భవన నిర్మాణాలు ప్రారంభమైనా రాజేష్‌తోపాటు మరికొందరు వాలిపోయి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తేస్తారట. టౌన్ ప్లానింగ్ అధికారుల మాదిరిగా భవన యజమానులను భయపెట్టి సొమ్ములు లాక్కుంటారని ప్రచారం జరుగుతోంది. డిమాండ్ చేసినంత ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేసి భవన నిర్మాణం ముందుకు కదలకుండా అడ్డుపడతారట. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌తోపాటు దొంగ నోట్లను కూడా చెలామణీ చేస్తూ పోలీసులకు చిక్కడంపై పెద్ద చర్చ నడుస్తోంది.


అంతాఅవినీతే..
దొంగ నోట్ల చెలామణీ వ్యవహారంలో చిక్కిన రవికుమార్ గతమంతా అవినీతిమయమే. డీఆర్డీఏలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రవి కుమార్ కరోనా సమయంలో పాత్రునివలస వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం బాధ్యతలను నిర్వర్తించాడు. అక్కడ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి కలెక్టర్ నివాస్ స్పందించి రవిని బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత స్వచ్ఛంద సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. 


అయితే దొంగ నోట్ల ముఠాతో రవికి ఎలా పరిచయం ఏర్పడింది, ఎవరు దించారు అన్నది తెలియడంలేదు. రవి, రాజేష్‌ పాత్రధారులేనని, ఇప్పుడు దొరికిన ప్రభాకర్‌రెడ్డి సూత్రధారిగా అంటున్నారు. వీళ్లే కాకుండా దీని వెనుకాల పెద్ద ముఠాయే ఉందని ఆ ముఠా కోసమే పోలీసులు గాలిస్తున్నారు. వాళ్లెవరూ తప్పించుకోకుండా పోలీసులు గట్టి వ్యూహం పన్నుతన్నారు.