Vangalapudi Anitha : ఆడబిడ్డల రక్షణపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలను సంరక్షించడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం ప.గో జిల్లా పాలకొల్లులో 'సేవ్ ది గర్ల్ చైల్డ్' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' పేరుతో 2కె రన్ నిర్వహించారు. రాష్ట్రంలో యువత గంజాయికి బానిసవుతున్నారని అందుకు సినిమాలు సైతం ఓ కారణమని అన్నారు. కొందరు యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడమే హీరోయిజంలా భావిస్తున్నారని అన్నారు. సినిమాల నుంచి మంచి కన్నా ఎక్కువగా చెడుకే ప్రభావితమవుతున్నారన్నారు. కానీ ఆడపిల్లలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలవుతారని చెప్పారు.
'తొలి పోలీసింగ్ అమ్మే చేయాలి'
ఏపీలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందుకోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అనిత స్పష్టం చేశారు. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని, పిల్లల సంరక్షణ బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలని సూచించారు. 'ఆడబిడ్డలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం' అని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతోనే మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. సీఎం చంద్రబాబు తర్వాత.. అదే స్థాయిలో పని చేసే వ్యక్తి నిమ్మల రామానాయుడని కొనియాడారు.
Also Read : Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
'ఆడపిల్లల రక్షణ.. సామాజిక బాధ్యత'
తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి 'సేవ్ ది గర్ల్ ఛైల్డ్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడాలనే లక్ష్యంతోనే ఈ పనిని తలపెట్టినట్టు చెప్పారు. ఆడపిల్లలను రక్షించుకోవడం సామాజిక బాధ్యత అని.. మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే.. సీఎం చంద్రబాబు మహిళల కోసం.. వారు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకే డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలన్న ఆయన.. వారిని ఇతర రంగాల్లోనూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. వారికి అవసరమైన మేర అవకాశాలు కల్పిస్తే.. మగవారికి ఏ మాత్రం తీసిపోరని ఈ సందర్భంగా నిమ్మల తెలిపారు.
Also Read : Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!