Central Government Re Thiniking On Jamaili Elections: జమిలీ ఎన్నికల (Jamili Elections) బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా.. లోకసభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించారు. తొలుత ఈ నెల 16న లోక్‌సభ (Loksabha) ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం ప్రకటించింది. అయితే, ఉన్న పళంగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ నెల 20 వరకే పార్లమెంట్ సమావేశాలు జరగనుండగా.. సెషన్‌లో బిల్లు పెడతారా అన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి. అసలు ఉన్నట్లుండి బిల్లు ఆపాలన్న నిర్ణయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమిత్ షా కీలక వ్యాఖ్యలు
'జమిలి ఎన్నికల'ను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కొత్తగా వచ్చింది కాదని.. గతంలో కూడా భారత్‌లో ఈ విధానాన్ని అనుసరించామని చెప్పారు. 1952లో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగాయని.. దేశంలో మూడుసార్లు జమిలి ఎన్నికలు నిర్వహించామని అన్నారు. 'కేరళలోని సీపీఐ (ఎం) ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విచ్ఛిన్న చేసిన తర్వాత ఈ విధానం మరుగున పడింది. 1971లో ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో లోక్‌సభ గడువు ముగియక ముందే రద్దు చేశారు. నాటి నుంచి దేశంలో ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు అసంబద్ధమైనవి.' అని అమిత్ షా పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం లేదని హోంమంత్రి అన్నారు. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల భారీగా ఖర్చు కావడం సహా సమయం కూడా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజాధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఆయా అసెంబ్లీలు/లోక్‌సభకు మాత్రమే ఐదేళ్లలో మిగిలి ఉన్న కాలం కోసం మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని అసెంబ్లీ, లోక్‌సభతో పాటే జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్ర కేబినెట్ 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లుకు ఆమోదం తెలిపిన కొన్ని గంటల తర్వాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఈ బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడింది.