Srikakulam Latest News: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పిలుపుతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కదలింది. ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝలిపిస్తోంది. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ఇసుక మాఫియాకి అడ్డుకట్టు వేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇసుక లోడ్ చేసుకుని ఒక చోట డంప్ చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా దుమారం రేపింది.
ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట వద్ద ఉండే నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఇసుకను అడ్డగోలుగా తవ్వేసుకుంటున్నారు. అక్కడి రేవులో ట్రాక్టర్‌లలో ఇసుకను లోడ్ చేసి వాటిని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలలో డంప్ చేస్తున్నారు. ఒక చోట ఇసుకను డంప్ చేసిన తర్వాత దానిని అక్రమంగా లారీల్లో లోడ్ చేసి ఇసుకాసురులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తంతు తమ్మినాయుడుపేట కేంద్రంగా కొనసాగుతుంది.
స్థానికంగా ఉండే రెవెన్యూ, పోలీసు అధికారులు తమ్మినాయుడుపైట వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోతుంది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో స్థానికంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని పలువురు సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సీఎంవో ఆదేశాలతో ఎచ్చెర్ల మండలానికి సంబందించిన రెవెన్యూ, పోలీసు అధికారులు కదిలారు. సిబ్బందితో కలసి తమ్మినాయుడుపేట వద్దకు చేరుకని ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అక్కడ ఉండే ఓ చోట ఇసుకను అక్రమంగా నిల్వ చేసినట్లుగా గుర్తించారు. ఇసుకలోడుతో ఉన్న 14 ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది కలసి అడ్డుకున్నారు.
ఈ ట్రాక్టర్లను అడ్డుకోవడంతో ఇసుక రవాణాదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసుకోవచ్చని వారు అధికారులతో వాగ్వాదానికి దిగి హడావుడి చేశారు. జాతీయ రహదారిపై వరుసగా ట్రాక్టర్లు, పెద్ద ఎత్తున ఇసుక రవాణాదారులు మోహరించిన దృశ్యాలు అక్కడ కనిపించాయి.
ట్రాక్టర్లను అడ్డుకున్న అధికారులు ఇసుక అక్రమ రవాణా వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీసే పనిలో పడ్డారు. ట్రాక్టర్లను సీజ్ చేశారు. ట్రాక్టర్ల డ్రైవర్లు అక్కడ నుంచి వాటిని తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వాటిని అక్కడే నిలిపివేసారు. నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రెవెన్యూ, పోలీసు అధికారులు వివరించారు.
Also Read: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
నిత్యం ఇసుక అక్రమ రవాణా
తమ్మినాయుడుపేట నుంచి ఇసుక నిత్యం అక్రమ రవాణా కొనసాగుతుంది. స్థానిక నేతలు తెర వెనుక ఉండి ఈ దందాను కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్లతో ఇష్టారాజ్యంగా ఇసుకను నదీ పరివాహక ప్రాంతంలో లోడ్ చేసి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేసిన తర్వాత దానిని లారీలలోకి ఎక్కించి విశాఖపట్నం తరలిస్తూ అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఇసుకాసురులు లక్షలకు లక్షలు వెనుకేసుకుంటున్నారు.
అనధికారికంగా ఇసుకను తరలిస్తూ దందాను బహిరంగంగానే కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వారు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. స్థానిక నేతలు అండదండలు ఇసుకాసురులకి ఉండడంతో సామాన్యులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. అసలు తమ్మినాయుడుపేట వద్ద అధికారిక ఇసుక ర్యాంపు లేదు. అధికారిక ర్యాంపులలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా ఇక్కడ అధికారిక ర్యాంపు లేకపోయినప్పటికీ ట్రాక్టర్లలోకి ఇష్టానుసారంగా ఇసుకను లోడ్ చేసి అక్రమంగా తరలించుకుంటున్నారు.
యథేచ్చగా ఈ ఇసుక దందా తమ్మినాయుడుపేట వద్ద కొనసాగుతుంది. దీంతో కొంతమంది ధైర్యం చేసి సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు కదిలారు. ట్రాక్టర్లను అడ్డుకున్నారు. నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం కాకుండా నిరంతరం తమ్మినాయుడుపేట వద్ద నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: శ్రీకాకుళం జిల్లా దొంగనోట్ల కేసులో కీలక పరిణామం- ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ