Paravada Fire accident | అమరావతి: అనకాపల్లి జిల్లాలోని పరవాడలోని సినర్జిన్‌ కంపెనీలో జరిగిన ప్రమాదం బాధితుల కుటుంబాలకు రూ.1 కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. సినర్జిన్‌ కంపెనీ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందించనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇటీవల అచ్యుతాపురం సెజ్‌ లో ఎసెన్షియా, పరవాడలోని సినర్జిన్‌ కంపెనీలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ రెండు ప్రమాదాల బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. కానీ ఆ పరిశ్రమల్లోని కార్మికులు, సిబ్బందికి తాము అండగా నిలిచినా, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి, విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించినట్లు చెప్పారు. హోం మంత్రిగా తాను ఈ రెండు ప్రమాద ఘటనల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు చెప్పారు.




Atchutapuram SEZ Fire Accident | అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో గత వారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటించింది. వారి కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం కావడంతో తీవ్రత కొంతమేర తగ్గింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందిస్తామని వెల్లడించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.