అభివృద్ధి మంచిదే కానీ.. అది ప్రజల అభివృద్ధి అయ్యుండాలని, కార్పొరేట్ల అభివృద్ధి కారాదని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. రైతుల నుంచి కారు చౌకగా భూములు కొనుగోలు చేసి.. కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై నిప్పులు చెరిగారు. బలవంతపు భూసేకరణ సరికాదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు 193 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉందని, దీన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కు ప్రభుత్వం 2020 ఎకరాలు భూమిని ఇస్తే.. ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని దివాలా పిటిషన్ వేసింది. దీంతో ప్రభుత్వం వేలం వేసి సామీర్ పేట్ లాజిస్టిక్ కంపెనీకి 26 కోట్ల రూపాయలకు కారు చౌకుగా కట్టబెట్టిందని విమర్శించారు. 12 నుంచి గ్రామాల్లో పర్యటన కార్గో ఎయిర్ పోర్ట్ కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను నిరసిస్తూ.. గ్రామాల్లో పర్యటిస్తామని వామపక్ష నేతలు ప్రకటించారు. అక్కడి రైతులను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల ప్రజల జీవన విధానం ధ్వంసం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదానీ ప్రదేశ్‌గా మార్చుతున్నారు
జిల్లా సస్యశ్యామలం కావాలంటే రూ. 1000 కోట్లతో వంశధార ఆధునీకరణ జరగాలని, శివారు భూములకు రెండు పంటలకు సాగునీరందిస్తే.. ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయని, ఉపాధి దొరుకుతుందని,వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. వంశధార ఆధునీకరణకు ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో చెప్పాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల అభివృద్ధి కన్నా ప్రజల అభివృద్ధి ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం అదానీ ప్రదేశ్ గా మార్చేస్తోందని ఆరోపించారు. జీడి, కొబ్బరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్దానం కిడ్నీ బాధితులు
ఉద్దానం పేరు చెప్పగానే ప్రధానంగా గుర్తొచ్చేది కిడ్నీ వ్యాధులు. దశాబ్దాల కాలం నుండి కూడా ఇక్కడ కిడ్నీ వ్యాధులతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వాటిపై దృష్టి సాధించి కిడ్నీ బాధితులను ఆదుకోవాలి కానీ ఈ విమానాశ్రయాలు వల్ల మాకు కలిగేది ఏముంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వలసలు అనేది ఉంటాయి. విమానశ్రయం వస్తే వలసలు నివారణ అనేది నివారిస్తాము అని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో మాకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మకాలేముంటాయి. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం వస్తుందని ఎలా అనుకుంటారు పూర్తిస్థాయిలో ఇవ్వరు. కిడ్నీ వ్యాధులతో ఎంతోమంది మృత్యువాత పడుతున్న వారికి సరైన వైద్యం చేకూరే విధంగా తగు చర్యలు చేపడితే ఎంతో బాగుంటుందని ఇలాంటి విమానాశ్రయాలు వల్ల తమకు ఏ ప్రయోజనం ఉండదని, ఇప్పటికే చాలామంది ఉద్యమ బాట పట్టారన్నారు. పలాసలో రీసెర్చ్ హాస్పిటల్ అంత పెద్దది నిర్మాణం చేసినప్పటికీ సరైన వైద్యనికాని అక్కడ ఏర్పాటు చేస్తే వాటికి మేము సంతోషిస్తాం. ఇక ఇలాంటి నిర్మాణాలు, ఎయిర్ పోర్టులు పెట్టి మా ప్రాణాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.