Accused arrested for making threatening calls to Pawan Kalyan | అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడి ఆట కట్టించారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ కాల్స్ చేయడంతో పాటు మెస్సేజ్‌లు పంపిన ఆగంతుకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీసుకు వచ్చిన బెదిరింపు కాల్స్, సందేశాలపై పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఈ విషయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. హోం మంత్రి అనిత ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు
పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి బెదిరించిన ఫోన్ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావు పేరిట ఉందని పోలీసులు గుర్తించారు. 95055 05556 నంబరు నుంచి ఫోన్ కాల్స్, సందేశాలు పంపిన నిందితుడ్ని అరెస్ట్ చేయడంతో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో నిందితుడు బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మల్లికార్జునరావును రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట పోలీసులు ఇది ఆకతాయి చేసిన పనిగా భావించలేదు. ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేసి బెదిరించాలని ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తాలని చూస్తున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునేందుకు ఇలాంటి బెదిరింపులు కాల్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసిన సీపీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఆ సెల్ ఫోన్ నెంబర్ ఉండగా.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న సెల్ టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఏపీ హోం మంత్రి అనితతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దాంతో కేసు విచారణలో భాగంగా విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్‌బాబు స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, విభాగాలకు చెందిన పోలీసులతో కొన్ని టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
సీక్రెట్ ప్లేస్‌లో నిందితుడ్ని ప్రశ్నిస్తున్న పోలీసులు
డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో తక్షణం సెల్ ఫోన్ లోకేషన్ ట్రాకింగ్ మొదలుపెట్టారు. కానీ బెదిరింపు కాల్స్ చేసిన అనంతరం ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో అగంతకుడు ఎక్కడ ఉన్నాడు అనేది అంత సులువుగా గుర్తించడం కష్టమైంది.. విజయవాడతో పాటు తిరువూరులోనూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే రాజకీయ కారణాలు కనిపించడం లేదని, మద్యం మత్తులో చేసిన కాల్స్ అని నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.