Srikakulam Latest News: కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల    మాత్రమే పట్టుకున్న గ్రహణంఎమ్మెల్యే, మంత్రులకు మొరపెట్టుకున్నా..ప్రయోజనం శూన్యంకలెక్టర్ చొరవ తీసుకోవాలంటూ వేడుకోలు.


మెరిట్లో వచ్చారు.. మెతుకుల్లేకుండా పోయారు. రోస్టర్ ప్రకారమే విధుల్లో చేరారు. వేతనాలకు నోచుకోలేకున్నారు. ఏడాదిన్నర నుంచి ఎక్కని గడప లేదు. కలవని అధికారీ లేడు. అందరిచుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వేతనాలివ్వండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న లోపాలతో వారి బతుకులు దయనీయమైపోయాయి. పలాసలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీనస్థితి ఇది. 


దశాబ్దాలుగా ఉద్దానాన్ని కబళిస్తున్న కిడ్నీ మహమ్మారి నివారణకు పని చేస్తున్న వారంతా పిడికెడు అన్నానికి దూరమైపోతున్నారు. చిన్నపాటి సాంకేతిక కారణాలు వారి పాలిట శాపంలా మారాయి. అప్పటి, ఇప్పటి పాలకవర్గాలు కాస్త అలసత్వం ప్రదర్శిస్తుండడంతో దీనావస్థలో బతుకులీడుస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.


ఇదీ కథ..
ఉద్దానంలో కిడ్నీ మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటైంది. అప్పటి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చొరవతో శరవేగంగా పనులు పూర్తి చేసుకుంది. వైద్యులు, స్టాఫ్ నర్స్ పోస్టులను ఆఘమేఘాలపై భర్తీ చేశారు. అలాగే అక్కడికి వచ్చే రోగులకు సేవలందించేందుకు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 60 పోస్టులకు జీజీహెచ్ శ్రీకాకుళం ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్, వైద్య,ఆరోగ్యశాఖ అనుమతులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ డీఈవో పోస్టులు 4, రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్టులు 4, ఓటీ అసిస్టెంట్లు 4,డయాలసిస్ టెక్నీషియన్లు 10, ల్యాబరేటరీ టెక్నీషియన్స్ 4, సీ ఆర్మ్ టెక్నీషీయన్స్ 4, సోషల్ వర్కర్లు 2, సపోర్టింగ్ స్టాఫ్ 22, సెక్యూరిటీ గార్డుల పోస్టుల 6, మొత్తం కలిపి 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 


రోస్టర్ పాయింట్ ప్రకారమే నియామకాలు జరిగాయి. వేర్వేరు కారణాలతో ఆరుగురు ఉద్యోగాల్లో చేరకపోగా, మిగలిన 54 మంది ఉద్యోగాల్లో చేరి, సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఎంపికైన వీరికి జీజీహెచ్ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ అప్రూవల్‌తోనే నియామకపత్రాలు అందజేశారు. నియామక పత్రాల్లో రోస్టర్ పాయింట్‌ను స్పష్టంగా పేర్కొన్నారు. అయినా వీరంతా వేతనాలకు నోచుకోవటం లేదు.


చిన్నలోపం శాపంగా మారి..
అంతా పక్కాగానే చేసిన అధికారులు.. ఈ పోస్టులకు ఆర్థిక అనుమతులు పొందటంలో ఫెయిల్ అయ్యారు. ఎలాగూ నియామకాలు అయిపోయాయి. అనుమతులు వచ్చాక వేతనా లు ఇచ్చేద్దాం అని భావించారు. కానీ ఆ క్రమంలో జరిగిన అలసత్వం ఈ ఉద్యోగులకు శాపంలా పరిణమించింది. అనంతరం సార్వత్రిక ఎన్నికలు రావటం..ఆ తరువాత ప్రభుత్వం మారిపోవటంతో అంతా తారుమారైంది. ఈ 54 మంది ఉద్యోగులకు వేతనాలు లేకుండా చేసింది. 


ఈ ఉద్యోగులంతా తమ దయనీయస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. అధికారులు, మంత్రులను కలిసి దీనస్థితిని వివరిస్తున్నారు. పలాసఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి గోడు చెప్పుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లిశ్రీనివాస్‌ను సైతం కలిశారు. వేతనాలు విడుదలయ్యేవా చూడాలని వేడుకున్నారు. జీజీహెచ్ అధికారులు, జిల్లా కలెక్టర్, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.



కష్టపడి కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసి ప్రాణాలకు నిలబెడుతున్నామని చెబుతున్నారు. నెఫ్రాలజిస్ట్ కొరత ఉన్నప్పటికీ పేషెంట్స్‌కి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. జీతాలు మాత్రం రావడం లేదుని... తినడానికి ఇబ్బంది పడుతుంన్నామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్లు, అధికారులు దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం దొరకటం లేదన్నారు. ఇక్కడ ఉండలేము బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



Also Read: అమ్మో చలి, ఉత్తారంధ్రలో ప్రజలను వణికిస్తన్న వాతావరణం