Srikakulam Weather: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వరుస అల్పపీడనాలతో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కూల్ అయింది. దీంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఒకవైపు వర్షాలు మరోవైపు చల్లటి గాలులతో జనం వణుకుతున్నారు. ఇళ్ళ నుంచి బయటకి అడుగు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. ఇటీవల వరుసగా రెండు మూడు రోజులు ముసురుపెట్టగా తాజా రెండు రోజుల నుంచి చల్లటి వాతావరణమే జిల్లాలో నెలకొంది. అసలే శీతాకాలం ఆపైన వర్షాలు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాత్రి పూట మంచుకురుస్తుంది. పగటిపూట సూర్యుడు దర్శనమివ్వడం లేదు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి వణికిస్తోంది.
జిల్లాలోని మైదాన ప్రాంతాలతోపాటు తీర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమ్మో చలి అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ప్రజలను చుట్టుముడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో సీజనల్ వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ్వరాలతోపాటు జలుబు, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. అలాకుండా ఆస్త్మా, బ్రాంకైటీస్ ,కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధలు పడే వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చలితీవ్రత ఒక వైపు పెరగడం మరో వైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ఆసుపత్రుల మెట్లు ఎక్కుతున్నారు. దీంతో ఆయా ఆసుపత్రులన్నీ కూడా పేషెంట్ల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా చలిగాలు ఉండేటప్పుడు, వర్షాలు పడేటప్పుడు బయటకు రావద్దని వారు స్పష్టం చేసారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి ఆ ప్రభావం జిల్లాపై కనిపిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఒకవైపు అల్పపీడన ప్రభావం మరోవైపు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడం వల్ల కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ చెబుతుంది.
రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంటుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుదవారం ఉదయం వరకూ సరాసరి 3.7 మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రెండు మండలాలలో మినహా ఇతర 28 మండలాలలో కూడా వర్షపాతం రికార్డ్ అయ్యింది. అత్యధికంగా కొత్తూరులో 16.2 మి.మీల వర్షపాతం నమోదు కాగా తర్వాత వరుసగా పాతపట్నం, హిరమండలం, ఇచ్చాపురం, కంచిలి, మందస, సోంపేట, ఎల్.ఎన్.పేట తదితర మండలాలలో వర్షపాతం నమోదైంది. ఇతర మండలాలలో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
దీంతోపాటుగా బాగా కురుస్తున్న మంచుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల అవుతున్నా సరే సూర్యోదయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఏజెన్సీ ప్రాంతాలు అయితే మరి చెప్పనవసరం లేదు భారీగా పడుతున్న వర్షాలకు వాతావరణం మార్పులకు మన్యం మొత్తం మంచం పట్టింది. చూడ్డానికి ఈ పొగ మంచు ఆహ్లాదకరంగా ఉన్న అనారోగ్యాలకి కారణం అవుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత నెల రోజులుగా పడుతున్న వరుస వాయుగుండంతో ప్రజలు ఉక్కిరిబిక్కులైపోతున్నారు.
పండగ సీజన్ మొదలవడంతో రైతులకు పొలంలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా మంచు కారణంగా పంటలు కూడా చాలా వరకు నష్టపోతాయి ఇప్పటికే కొన్ని పంటలను వర్షాల వల్ల ఇబ్బందులతో ఎదుర్కుంటే మరో పక్కన ఈ పొగ మంచు వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేగాని కంటిన్యూగా అయితే మాత్రం రానున్న వేసవి కాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెబుతున్నారు. వృద్ధుల్లోని చిన్నపిల్లల్లో అయితే మాత్రం అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయంటూ వైద్యులు చుట్టూ పరుగులు పెడుతున్నారు ఉత్తరాంధ్రవాసులు.