Pawan Kalyan News | గిరిజన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది NDA ప్రభుత్వం. గత నెల (డిసెంబర్)లో పార్వతీపురం మన్యం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మరిన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరి నెలలో నిధులు రానున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిధులు రాగానే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అదే సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.
నిధులు విడుదల
ఈ మేరకు జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా రూ.163.39 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 111.68 కోట్లు మొత్తంగా రూ.275.07 కోట్లను విడుదల చేసింది. NDA ప్రభుత్వం ఇచ్చిన ఈ నిధులతో మరిన్ని గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించడం ద్వారా, డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. దాంతోపాటుగా పర్యాటక రంగ అభివృద్ధి చేసే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేయనుందని పేర్కొన్నారు.
పవన్ చొరవతో రోడ్లు
పల్లెపండుగలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇటీవల మన్యం పార్వతీపురం జిల్లా సారవకోట కిడిమి రోడ్ నుంచి సింగమవలస వరకు రూ. 65 లక్షల మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు సౌకర్యం కల్పించారు. ఇన్నాళ్లకు తమ ప్రాంతానికి రోడ్డు మార్గం వేయడంతో ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ చొరవకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుంచి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా రూ 90.50 లక్షల అంచనాతో 2 కిలోమీటర్లు తారు రోడ్డు వేశారు. తద్వారా మర్రిపుట్టు గ్రామానికి డోలి మోతలు నివారించాం. వారిని విద్య, వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువ చేశామన్నారు. గతంలో ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడేవారు.