YCP activists who have become fans of Jana Sena And trying to break the alliance: కూటమి పార్టీల మధ్య సయోధ్యను దెబ్బతీసేలా ఎవరూ ప్రకటనలు చేయవద్దని పవన్ కల్యాణ్ తమ క్యాడర్‌కు సుదర్ఘంగా ఓ లేఖ రాశారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ సానుభూతిపరులుగా చెప్పుకుంటున్న వారు కూటమి పార్టీలపై విరుచుకపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీపై ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవి విషయంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇలా ఉన్న సమయంలో దావోస్‌కు పవన్ ను తీసుకెళ్లలేదన్న చర్చను ప్రారంభించారు. కడపలో ఓ వైసీపీ అభిమానే .. జనసేన ఫ్యాన్ గా మారి పోస్టర్ వేశారు. ఇలా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో జనసేన అభిమానుల పేరుతో టీడీపీపై విమర్శలు
కూటమిలో చిచ్చు పెడితే తప్ప వైసీపీకి రాజకీయంగా ఊపిరి అందదు అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తూండటంగా వైసీపీ ఆ దిశగా ఏమైనా వ్యూహాలు ఖరారు చేస్తుందో లేదో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం కూటమి పార్టీల మధ్య .. ఆయా పార్టీల సానుభూతి పరుల మధ్య ఫ్యాన్ వార్స్ పెరిగేలా చేయగలిగారు. పవన్ కల్యాణ్‌నే అద్భుతంగా పని చేస్తున్నారని కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. దావోస్ కు పవన్ వెళ్లనందునే ఎంవోయూలు చేసుకోవడానికి ఎవరూ రాలేదని అంటున్నారు. అదే సమయంలో లోకష్ ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు .. పవన్ కల్యాణ్ ను తగ్గిస్తున్నాని అంటున్నారు. ఇలా రకరకాల ప్రచారాలతో చాలా మంది తెరపైకి వస్తున్నారు. మెల్లగా దీన్ని సోషల్ మీడియా నుంచి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కడపలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
జనేసనలో చేరుతున్న వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు
మరో వైపు వైసీపీ ద్వితీయ శ్రేణి క్యార్ ఇటీవలి కాలంలో జనసేన పార్టీలో చేరడం ప్రారంభించారు. కొంత మంది ముఖ్య నేతలు కూడా పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ఇలా చేరేవారంతా జనసేన పార్టీకి నిఖార్సుగా పని చేస్తారో లేదో కానీ..అధికారం ఉందనే పార్టీలోకి వచ్చి చేరుతున్నారన్నది నిజం. వారంతా రేపు టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. పవన్ కల్యాణ్ ను పొగడం.. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎదిగిపోతామని ప్రచారం చేయడం ద్వారా కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
కూటమి పార్టీల ఐక్యతకు అసలు పరీక్ష
కూటమిగా ఉంటే ఏపీలో ఇతర పార్టీలకు చోటు లేదని అర్థం అయిపోతుంది. అందుకే వైసీపీ కకావికలం అయిపోతోంది. పలువురు దిగ్గజ నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కూటమి పార్టీలు ఎంత ఐక్యంగా ఉంటే అంత ఎక్కువగా వైసీపీ నిర్వీర్యం అయిపోతుంది. కానీ పార్టీల అగ్రనేతలు ఓ స్పిరిట్‌తో ఉంటున్నారు. కార్యకర్తలు మాత్రం కింది స్థాయిలో ఫ్యాన్ వార్స్‌కు దిగుతున్నారు. అక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. దీన్ని కూటమి పార్టీలు అధిగమించాల్సి ఉంది.