Janasena Politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  మాటను జనసైనికులు ఒక శాసనంలా భావిస్తుంటారు. ఆయన చెబితే చాలు ఏం చేయడానికైనా మేము రెడీ అంటారు. అయితే తన కేడర్ను అభిమానుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. ఎవరూ అనవసర తగాదాలు పెట్టుకోవద్దు.. అనవసర చర్చలకు దిగొద్దు అంటూ తన అభిమానులను ఉద్దేశించి మరీ పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చను రేపుతోంది. దీంతో అసలు జనసేనలో ఏం జరుగుతోంది అన్న డిస్కషన్ ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది 


లోకేష్ కి డిప్యూటీ సీఎం  పదవి ఇవ్వాలి అన్నప్పుడు మొదలైన రాజకీయ రచ్చ 
 కొంతకాలంగా  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు  మంత్రి పదవి ఇవ్వాలంటూ  టిడిపి లోని ఒక వర్గం  గట్టిగా డిమాండ్ చేస్తోంది. విచిత్రం ఏంటంటే వీళ్ళలో చాలామంది రాజకీయంగా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరకు చేరుకున్నవారు, ఏ పదవి దక్కని వారు  కావడం గమనార్హం. ఇదంతా అధినేత దృష్టిలో పడటం కోసం  అనే విశ్లేషణలు ఉన్నాయి. వీరిని చూసి ఒకరిద్దరు మంత్రులు కూడా  ఇదే డిమాండ్ వినిపిస్తే సీఎం చంద్రబాబు నాయుడు వారిని మందలించారు కూడా. అయితే మరోవైపు టిడిపి నుంచి వస్తున్న డిమాండ్ ను గమనించిన జనసైనికులు  పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలంటూ సోషల్ మీడియాలో తమ తరపు వాదన వినిపించడం మొదలుపెట్టారు. ఆ డిమాండ్ నెమ్మదిగా పెద్దది కాసాగింది. దీనితో పరిస్థితి చేయి దాటితే  కూటమి సమన్వయమే దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ గమనించి ఈ బహిరంగ లేఖను రిలీజ్ చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.


మరి కొంతమంది  కూటమి కార్యకర్తలు, అభిమానులు  ఇటీవల తాడేపల్లి లోని జగన్ నివాసం ముందుకు వెళ్లి నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు సరికాదని అటు సీఎం చంద్రబాబు,ఇటు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సీట్ల పరంగా 11 మంది ఎమ్మెల్యే లు మాత్రమే ఉన్నా ఓటింగ్ శాతం మాత్రం 40% ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదేపదే ఈ విషయం చెప్పుకొస్తున్నారు. ఇలా అభిమానులు కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసే చర్యలు వైసీపీకి ప్రజల్లో సింపతి తెచ్చే ప్రమాదం ఉందని కూటమినేతలకు బాగా తెలుసు. గతంలో ఇది వాళ్ళ విషయం లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పవన్ కళ్యాణ్ తన బహిరంగ లేఖలో  ' అనవసర తగాదాల్లో '  తల దూర్చొద్దని పేర్కొన్నారు అంటున్నారు ఎనలిస్టు లు 


 కొందరు మితిమీరి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా??
 జనసేనలోని ఒకరిద్దరు నేతలు  అత్యుత్సాహం తో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అభిప్రాయం పార్టీలో ఉంది. మంత్రులు,ఎమ్మెల్యేలు కాదు గాని ఆ తర్వాత స్థాయిలో ఉండే కొందరు కొన్ని వివాదాల్లోకి తల దూర్చుతున్న సంగతి అధిష్టానానికి తెలుసు. ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వాలు ఇలాంటివి సహించవు. విశాఖ గోదావరి జిల్లాల ప్రాంతాలకు చెందిన నేతలు ఈ విధంగా అవతలి వారితో  మితి మీరిన  స్నేహమో లేక అనవసర శత్రుత్వమో పెంచుకుంటున్నారన్న సమాచారం హైకమాండ్ దగ్గర ఉంది. 



 పదవుల కోసం పైరవీలు చేస్తున్నారా?


 తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి  ప్రతి ఒక్కరూ పదవులు ఆశించడం సహజమే కానీ దానికి తగ్గ అవకాశం, సందర్భం కలిసి రావాల్సి ఉంటుంది. పైగా చాలా సమీకరణాలు ఉంటాయి. కానీ కొందరు పదవులకోసం కూటమిలోనే పైరవీలు చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ " తనకు సైతం పదవులు మీదే ఆశ లేదని,కష్టపడి పనిచేయడం ఒక్కటే తెలుసని " లేఖలో పేర్కొంటూ పార్టీ క్యాడర్ కు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.


100%  సీట్లతో హిస్టరీ సృష్టించినా తమ గెలుపు వెనక వైసీపీ పాలనపై ప్రజల్లో ఉన్న  వ్యతిరేకత కూడా కలిసి వచ్చిందని  జనసేన నాయకులు మరిచిపోవద్దని పవన్ తన లేఖ ద్వారా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తుంటే జనసేనలో  అనవసర వివాదాలు కుమ్ములాటలు లేకుండా ముందుగానే ఒక చెక్ పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారని పిస్తోంది. ఇంతకుమించి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.


Also Read: Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు