Telugu states Leaders are campaigning in Delhi Assembly elections :  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని , చురుగ్గా పని చేసేవారిని ఢిల్లీకి పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించారు. అమిత్ షా వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధితో పాటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా  హైకమాండ్ పిలిపించిన వారిలో ఉన్నారు. వారందరికీ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. 





 ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఓటర్లుగా ఉంటారు. తెలుగు వారు కూడా చాలా నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రబావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం చేస్తున్నారు. రాహతాస్ నగర్ నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి తెలుగు ప్రజల్ని కలుసుకున్నారు. 



కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే.. తెలుగు వారు ఎక్కువగా ఉంటే.. ఏపీ బీజేపీ నుంచి కీలక నేతలు వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు. కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉండి గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.                   


ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈ సారి మహారాష్ట్ర తరహాలో తెలుగు రాష్ట్రాల అగ్రనేతల్ని పిలిచి ప్రచారం చేయించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఢిల్లీలోనూ ఆయన ప్రచారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేయాల్సి ఉన్నా.. ఆయన సోదరుడి ఆకస్మిక మరణంతో క్యాన్సిల్ అయింది. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి మూడో తేదీ వరకూ ఉంటుంది.                                     


Also Read: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు