మునుగోడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తమ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధును ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని, గ్రామాల్లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. 


కేసీఆర్ పాలనే బాగుండేదని మెచుకుంటున్నారు
కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు (ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్​ కార్డులు) ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్​ రెడ్డి మాట్లాడుతూ ‘తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని తిరుడున్నారు. అంతా కేసీఆర్‌ పాలనే బాగుండేదని మెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.


రైతు బంధును ఓసారి ఎగ్గొట్టినం!
‘రైతుబంధును మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించినం. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అదే రూ.2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరు. ఎన్ని అప్పులు చేసైనా పథకాలు అమలు చేస్తాం’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ప్రతిపక్షాల విమర్శలు
సొంత పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే  రాజగోపాల్​ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంటున్నారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.