Telangana: తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2023లో ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జనవరి 26 ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుడిని మామిళ్లగడ్డ  గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం కొంతమంది దుండగులు ఈ యువకుడిని ఆదివారం అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.


కృష్ణది మాములు హత్యా, పరువు హత్యా..?


సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అనే యువకుడు 6నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. చెల్లెల్లు భార్గవి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె సోదరుడు.. కృష్ణపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణను చంపేసి, డెడ్‌బాడీ ని జనగామ నుంచి పిల్లలమర్రికి వెళ్లే రహదారిలో ఉన్న మూసీ కాలువ సమీపంలో పడేశారు. అనంతరం సమాచారమందుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన ఆధారాల కోసం వెతకడం ప్రారంభించారు. పక్కా ప్లాన్ తోనే తలపై బండరాయితో పలుమార్లు మోదడం వల్లనే కృష్ణ మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 


అయితే ఇప్పటికే పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న కృష్ణ.. ఇలా సడెన్ గా హత్యకు గురికావడం అటు జిల్లాలో, ఇటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. భార్గవి సోదరుడే ఈ హత్య చేశాడా, లేదా ఇంకెవరైనా చేశారా అన్న విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో కృష్ణది పరువు హత్యనా లేదంటే లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


కులాంతర వివాహం చేసుకుందని సోదరి హత్య


డిసెంబర్ 2023లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ పరువు హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సొంత తమ్ముడే తన అక్కను దారుణంగా హతమార్చాడు. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి, శ్రీకాంత్ అనే యువకుడు నవంబర్ 1, 2023న యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట హయత్ నగర్ లోనే నివాసముంటోంది. అయితే సెలవులో సొంత గ్రామానికి వెళ్ళి, ఉదయాన్నే స్కూటీపై పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన నాగమణిని తమ్ముడు పరమేశ్ వెంబడించి మరీ చంపాడు. మొదట కార్ తో ఢీ కొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.


Also Read : Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు