Pawan Kalyan Note to Janasena Leaders | అమరావతి: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేయగా, మరికొందరు టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి లోకేష్‌కు సీఎం పదవి ఇవ్వాలని, ఏపీ భవిష్యత్ ఆయనేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. తాను చెప్పిన ఈ మాటల్ని పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 


జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలివే
‘2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, బిజేపీ, జనసేన పార్టీతో కూడిన NDA కూటమి సాధించిన ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలమే కాదు, గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై.. సంఘ విద్రోహక చర్యలపై ప్రజల తిరుగుబాటు. చట్ట సభల్లో వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, అభివృద్ధికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల రాష్ట్రంగా మార్చడంపై ఏపీ ప్రజలు విసుగు చెందారు. రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టిందుకు అనుభవం కలిగిన పాలన, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం స్థానాల్లో మనకు విజయాన్ని అందించారు.


2024 సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమికి 184/175 స్థానాలను, జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, పోటీ చేసిన 2 పార్లమెంటు స్థానాల్లో  అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు మనకు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా మలచుకున్నాం. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సహాయ, సహకారాలతో, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నాం. అందుకు 5 కోట్ల ఏపీ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతకు భవిష్యత్తు అందించాలనే ధృఢ సంకల్పమే కారణం. 


కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా ఉంటూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, NDA కూటమి అంతర్గత విషయాలపై కానీ, నాయకులు ఎవరైనా పొరపాటున స్పందించినా సరే.. ప్రతిస్పందనగా మీరు ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు. ఆ వ్యాఖ్యలపై బహిరంగంగా చర్చించడం లాంటివి చేయవద్దు. 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలని ఎంతో బాధ్యతగా, 2047 నాటికి స్వర్ణాంధ్ర  సాధించి, వికసిత్ భారత్ సాధనలో 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. 
పదవుల కోసం పాకులాడలేదు
నేను (పవన్ కళ్యాణ్) ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను కూడా. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం మాత్రమే నాకు తెలుసు. పుట్టిన గడ్డను అభివృద్ధి చేయాలని భావిస్తాను. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ విషయాన్ని గ్రహించి మన కూటమి ఔనత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చ్ 14న జరగనున్న జనసేన (Janasena Party) ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలపై సమగ్రంగా చర్చించుకుందాం అని’ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు.


Also Read: Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్