Raghurama Custodial Torture | ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులను రాఘురామ కృష్ణరాజు గుర్తించారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు, మరో వ్యక్తిని జడ్డిముందు ప్రవేశపెట్టి పరేడ్ నిర్వహించారు పోలీసులు. కస్టడీలో తనపై దాడి కేసులో నిందితులను గుర్తించానని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. తాను ముఖానికి కర్చీఫ్ కట్టుకుని దాడి చేసిన వ్యక్తిని గుర్తించానని రఘురామ తెలిపారు.
నా గుండె మీద కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించా..
పరేడ్ అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామ మీడియాతో మాట్లాడారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో వచ్చాను. ఎంపీగా ఉన్న సమయంలో నాపై పోలీస్ కస్టడీలో దాడి చేసింది. నా మీద కూర్చొని దాడి చేసిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించాను. తులసిబాబుకు ఎక్కడి నుంచి మద్దతు లభించిందో అందరికీ తెలుసు. అతడికి టీడీపీతో ఎలాంటి లింకులు లేవని గతంలోనే బహిర్గతమైంది. ఎస్పీ వద్దకు సైతం నేరుగా వెళ్లగల మనిషి తులసి బాబు. జడ్జి ఎదుట హాజరై పోలీస్ పరేడ్ లో నిందితులను చూసి గుర్తుపట్టాను. పోలీసులకు వివరాలు తెలిపాను’ అని రఘురామ చెప్పారు.
వారిని కూడా విచారించాలి..
నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1, ఏ2ను విచారణకు పిలవకపోవడంపై ఆశ్చర్యమేస్తోంది. ఈ కేసులో అప్పటి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తో పాటు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, అప్పటి ఏఎస్పీ విజయ్‌పాల్ లను పూర్తి స్థాయిలో విచారించాలన్నారు. కానీ డాక్టర్ ప్రభావతి ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వారు ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా న్యాయం తనపైపే ఉందన్నారు రఘురామ.
సుప్రీంకోర్టులో రఘురామ కేసు..
రఘురామ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి ఆ కేసును బదిలీ చేసింది. జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనానికి కేసు విచారణ మార్చింది.