AP Ministers Progress Report | అమరావతి: ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసింది. గత ఏడు నెలల్లో మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంత్రుల అధికారిక కార్యక్రమాలతో పాటు, వారికి కేటాయించిన శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై రిపోర్ట్ చేయనున్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో పాటు పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు లాంటి ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఆదేశాలతో పలువురు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.


ఒక్కో శాఖపై ఒక్కో నివేదిక


 ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా ఒక్కో శాఖలో మంత్రి నిర్ణయాలు, వారి పనితీరుపై సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నివేదికల ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఏపీ మంత్రుల పనితీరుకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. వీటితో పాటు గత రెండు క్యాబినెట్ ల లోను మంత్రులు పనితీరు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు, శాఖలో మార్పులపై నివేదిక ఇవలేదని సమాచారం. సీఎం చంద్రబాబు సూచనతో పలువురు మంత్రులు స్వయంగా నివేదిక అందజేయని కారణంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే భారీ వర్షాలతో విజయవాడలో వరదలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలు నీట మునగగా మంత్రులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వరద బాధితులకు సాయం చేశారు. సినీ సెలబ్రిటీటలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు విరాళం ఇచ్చారు. ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేసింది. కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో పరిస్థితి చేజారిందని, సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టినట్లు మంత్రులు ఆ సమయంలో బదులిచ్చారు. 


తిరుపతి లడ్డూ వివాదం.. తొక్కిసలాట ఘటన
ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూ కల్తీపై దుమారం రేగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తిరుమలలో కల్తీ నెయ్యిని వైసీపీ కాలంలో వాడారని ఆరోపించారు. అయితే కల్తీ నెయ్యి గుర్తించి తిప్పి పంపించాం కానీ ఏనాడూ శ్రీవారి ప్రసాదాలలో వాడలేదని వైసీపీ నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు వైసీపీపై దుష్ప్రచారం చేశారని జగన్ సైతం ఘాటుగా స్పందించారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంటా టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కొంచెం ప్రతికూలత తేనుంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నుంచి కాకుండా టీటీడీ నుంచి ఆర్థిక సాయం చేయడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.


Also Read: AP Republic Day 2025 Celebrations: విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్