Republic Day Google Doodle | యావత్ భారతదేశానికి నేడు ఎంతో ముఖ్యమైన రోజు. ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చి భారత్ సర్వసత్తాక, గణతంత్రంగా మారిన రోజును పురస్కరించుకుని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ స్పెషల్ డూడుల్ డిస్ ప్లే చేసింది. భారత్‌లోని సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా డూడుల్ ను గూగుల్ రిప్రజెంట్ చేసింది. 


గంభీరమైన పులి, అందమైన నెమలి, మొసలి మరిన్ని జంతువులు గూగుల్ డూడుల్‌లో దర్శనమిచ్చాయి. గెస్ట్ ఆర్టిస్ట్ రోహన్ దహోత్రే నేటి గూగుల్ డూడుల్ రూపొందించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని జంతువులను భిన్నమైన వస్త్రధారణతో డూడుల్ లో చోటిచ్చినట్లు గూగుల్ ఇండియా పేర్కొంది.


భారతదేశ గొప్పతనంతో పాటు భిన్న సంస్కృతిని డూగుల్ హైలైట్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల వైవిధ్యాన్ని సూచించే మొసలి, మంచు చిరుత, పులి మరికొన్ని జంతువులు, పక్షులను చూపించారు. మరోవైపు ఆ జంతువులన్నీ ఆయా ప్రాంతాల్లో ధరించే భారతీయ దుస్తులను ప్రదర్శించాయి. పూణేకు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రోహన్ దహోత్రే రిపబ్లిక్ డే డూడుల్‌ను రూపొందించారు.