Republic Day 2025 | నేడు (జనవరి 26న) యావత్ భారతావని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్య్రం సాధించుకున్న భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన చారిత్రక రోజు నేడు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు మనం గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉజ్వల వేడుకలు జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం కొనసాగేందుకు కృషి చేసిన అందరికీ నమస్కారాలు. మన రాజ్యాంగ విలువలు పాటిస్తూ, స్థిరమైన, సంపన్న భారతదేశం కోసం కృషి చేద్దాం. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. - ప్రధాని నరేంద్ర మోదీ
వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047
భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ... భారత ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047ల లక్ష్యసాధనకు రాజ్యాంగ స్పూర్తితో కృషి చేద్దాంమని పిలుపునిచ్చారు.
గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలి- సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన “గణతంత్ర దినోత్సవం” సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ‘గణతంత్ర దినోత్సవ’ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, దేశాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.