శ్రీకాకుళం : అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు ఇదివరకే ప్రజల్లోకి వెళుతున్నారు. వైఎస్సార్‌సీపీ తమ మంత్రులతో బస్సు యాత్ర చేపట్టగా, టీడీపీ మహానాడు నిర్వహించింది. తాము సైతం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన సైతం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి జనసేన పార్టీ జనాల్లోకి వెళ్లనుంది. జనసేనాని ఆలోచన, పార్టీ విధానం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాగబాబు సిద్ధమయ్యారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా నుంచే పర్యటన ప్రారంభించగా.. నేడు జనసేన పార్టీ నుంచి సైతం అదే ఫాలో అవుతున్నారు.


ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్
జూన్ 1వ తేదీ నుంచి జనసేన పార్టీ కూడా జనాల్లోకి వచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఆ పార్టీనేత నాగబాబు పర్యటన వెలువడడంతో సిక్కోలు జనసైనికుల్లో అప్పుడే ఉత్సాహం కనిపిస్తోంది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. జూన్ 2న విజయనగరం, 3న విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటన కొనసాగనుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు. నాగబాబు పర్యటన ప్రకటనతో ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.






ఈ తాజా పర్యటనలో భాగంగా నాగబాబు.. ఉత్తరాంధ్ర జనసేన ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలు, నియోజకవర్గ కమిటీ నేతలు, వివిధ విభాగాల కమిటీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారని తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యాచరణను జనసేన శ్రేణులకు నాగబాబు వివరించనున్నారు. పార్టీ అభివృద్ధికి నేతలు, శ్రేణుల నుంచి సలహాలను స్వీకరించడంతో పాటు స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు. 


నాగబాబు పర్యటనలో భాగంగా, జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. జూన్ మొదటి వారంలో నాగబాబు వస్తుండడంతో ఉత్తరాంధ్రలో జనసైనికుల సందడి మొదలైంది. జిల్లాలో ఎక్కడ నుంచి పర్యటన ప్రారంభమౌతుందో త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి


Also Read: AP CM Jagan 3 Years of Ruling: మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనా ! చంద్రబాబు కల నెరవేరుతుందా ? 


Also Read: 3 Years of YSRCP Rule: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు సాధ్యమా ? నిజంగానే క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ ఉందా !