AP CM Jagan 3 Years of Ruling: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి నెలలు గడవకముందే.. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ సవాల్ విసిరారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అప్పటినుంచి ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారీ ఎన్నికలకు వెళ్దాం దమ్ముంటే రండి అంటూ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. అమరావతి రెఫరెండం పెడతామంటారు, ఏపీలో అభివృద్ధిని రెఫరెండంగా పెట్టాలంటారు.. ఇలా రకరకాలుగా ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ తమ సత్తా చూపించలేకపోయింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి మాత్రం సరైన కారణంలా చెప్పుకోలేకపోతున్నారు. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు మరోసారి జోస్యం చెబుతున్నారు.
వ్యతిరేఖత పెరిగే అవకాశం..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలిసిపోయిందని, ఇంకా ఎక్కువ రోజులు వేచి చూస్తే ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు చంద్రబాబు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి.. అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని, ఐదేళ్లు పాలించాలని చెప్పారని, అలాంటిది తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని గతంలో ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత ఆయనే మరో సందర్భంలో.. ముందస్తు ఎన్నికల ప్రస్తావనను పూర్తిగా ఖండించలేకపోయారు. దీంతో వైసీపీ క్యాడర్ లో కూడా కొంత గందరగోళం నెలకొంది.
ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలి..?
2014లో ఉమ్మడి ఏపీలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఏపీ, తెలంగాణలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి పూర్తి మెజార్టీ ఉంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు 2019లో ఎన్నికలు జరగాలి. కానీ తెలంగాణలో కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. 2018లోనే ప్రజా తీర్పు కోరారు. ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, తమకి సంపూర్ణ మద్దితివ్వాలని కోరారు. ఆ పిలుపు మేరకు ప్రజలు కేసీఆర్ కి మెజార్టీ పెంచారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారనుకోండి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో ఉందా అంటే అనుమానమే. ప్రస్తుతం ఏపీలో 151 సీట్ల భారీ మెజార్టీతో ఉంది వైసీపీ. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీ వైపుకి వచ్చేశారు. అంటే ఆ పార్టీ బలం 156కి పెరిగింది. తమ పార్టీలో చేరాలంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలనే కండిషన్ ని జగన్ ఎత్తేస్తే.. మరికొంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనా కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో జగన్ ముందస్తుకి ఎందుకు వెళ్లాలి..?
ముందస్తుకి వెళ్తే ఎవరికి లాభం..?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగనే సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి. ఈమేరకు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు వస్తున్నాయి. పోనీ కొంతకాలం వేచి చూసినా కూడా వైసీపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం లేదు. అసలు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలైనంత కాలం ఏపీకి ఎంత అప్పు ఉంది, ప్రజలపై అప్పుల భారం ఎంత పెరిగింది అనేది ఎవరూ ఆలోచించట్లేదు. బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ అయిందా లేదా అనేదే ఆలోచిస్తున్నారు. సో.. ఇలాంటి సమయంలో జగన్ ముందస్తుకి వెళ్లాల్సిన అవసరమే లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ.. జగన్ ముందస్తుకి వెళ్తే అది పెద్ద సాహసమేనని చెప్పాలి. ప్రజలు పూర్తి మద్దతు ఇస్తే, ప్రజా ధనాన్ని వృధా చేస్తూ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే అపవాదు ఆయన్ను చుట్టుముట్టే అవకాశముంది. దాదాపుగా జగన్ ముందస్తుకి వెళ్లరు, చంద్రబాబు ఆశలు నెరవేరవు.
Also Read: 3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?