3 Years of YSR Congress Party Rule :  బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ అరవై శాతం పాలనా కాలాన్ని పూర్తి చేసింది. అంటే..  తాము ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో వాటిని చేసి చూపింంచాల్సిన సమయం ముగిసిపోయిందని అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఈ మూడేళ్ల పాలనపై ప్రజలేమనుకుంటున్నారు ? సీఎం జగన్ పాలన అందరికీ నచ్చిందా ? కొందరికీ నచ్చిందా ? ఎమ్మెల్యేలపై అసంతృప్తి భగ్గుమంటోందా ? 


ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గుతోందన్న సీఎం జగన్ ! 


వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఎలా ఉండాలన్నదానిపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఇప్పట్నుంచి ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ ఆధారంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. 2019 ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యే గ్రాఫ్ ప్రస్తుతం ఉన్న గ్రాఫ్ వివరిస్తూ జాగ్రత్తలు సూచిస్తోంది. మేల్కొంటే ఒకే లేకుంటే మార్పు అనివార్యమన్న సంకేతాలిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న క్లారిటీని సదరు ఎమ్మెల్యేలకు చూపించడంతో సిట్టింగ్‌లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మూడేళ్ల పనితీరు ప్లస్, మైనస్ విస్తరిస్తూ జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలూ ఇస్తున్నారు. అదే సమయంలో అవినీతి, అందులో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వివరిస్తూ లోకల్ రాజకీయాల్లో గ్రూపు రాజకీయాలపైనా సునిశిత వార్నింగ్ సైతం ఇస్తున్నారు ముఖ్యులు. ఇటీవల సర్వేల్లో తనకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని ఎమ్మెల్యేలకు నలభై శాతం మార్కులు రావడం లేదని జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరికలు జారీ చేసి పంపించారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలన్నారు.  అంటే మెజార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని అనుకోవాలి. 


తనకు 65 శాతం గ్రాఫ్ ఉందన్న సీఎం జగన్ ! 


ప్రస్తుతం అరవై ఐదు శాతంతో తన గ్రాఫ్ బాగుందని జగన్ స్పష్టం చేశారు. సీఎంగా ఎమ్మెల్యేగా..  పార్టీ అధినేతగా తన గ్రాప్ చాలా బాగుందన్నారు. కానీ చాలా మంది పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ నలభై శాతం మాత్రమేనని వారందరూ .. తమ గ్రాఫ్ మెరుగుపర్చుకోకపోతే..   వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయని.. ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదన్నారు. మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం అందరూ సిద్ధం కావాల్సిందేన్నారు.   సీఎం జగన్ చెప్పిన సర్వే ప్రకారం చూస్తే ప్రజల్లో ఎమ్మల్యేలపై అసంతృప్తి ఉంది కానీ.. సీఎం జగన్ పాలనపై లేదని చెప్పుకోవచ్చు.   


ఆల్ ఇన్ వన్ సీఎం అయితే ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు ? 


వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ఈ మూడేళ్లలో పెద్దగా పని చేసే అవకాశం చిక్కలేదు. ఆర్థిక సమస్యలు..కరోనా సవాళ్లు వారిని వెంటాడాయి. బిల్లుల వస్తాయని  పార్టీ నేతలతో చేయించిన పనులు బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ బిల్లుల కోసం ఎమ్మెల్యేలపై పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.  పాలనా పరంగా చూసినా మొత్తం సీఎం జగనే. సంక్షేమ పథకాల విషయంలో కానీ.. ఇతర అంశాల్లో కానీ ఎమ్మెల్యే్ల ప్రమేయం లేదు. తమకన్నా వాలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది.  చిన్న చిన్న పనులు కూడా వాలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తమపై అసంతృప్తి ఎలా అని మథనపడుతున్నారు. అయితే పార్టీ పరంగా ఈ వాదన కరెక్టే కానీ ప్రజల కోణంలో చూస్తే... వారికి ఇవన్నీ అవసరం లేదని.. సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమని చెబుతున్నారు. ఈ కారణంగానే ఎమ్మల్యేలపై అసంతృప్తి ఖాయమని భావిస్తున్నారు. 


అధికార వ్యతిరేకత సహజం.. ఎంత తగ్గించుకుంటే అంతగా మళ్లీ విజయావకాశాలు !


ఏ  ప్రభుత్వానికైనా యాంటీ ఇన్‌కంబెన్సీ అనేది ఉంటుంది. అయితే అది ఓడించేలా ఉంటుందా లేక.. కాస్త బలం తగ్గేలా ఉంటుందా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాలతోనే తేలుతుంది. ప్రజారంజకమైన పాలన అందించినప్పటికీ.. అప్పటికి ప్రజల భావోద్వేగాలు.. కులాలు.. మతాల సమీకరణలు అన్నీ కలసి వస్తాయి. ఓటింగ్ జరిగేటప్పుడు ప్రజల  ప్రాధాన్యం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అందుకే.. ఇప్పటికిప్పుడు వచ్చే అనుకూల, వ్యతరేక అంచనాల కన్నా... చివరి ఏడాదే అత్యంత కీలకం అని అనుకోవచ్చు.