నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ తొలి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల మే 27న కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆ సమయానికి నాలుగు రోజులు ఆలస్యమైందని పేర్కొంది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే నైరుతి రుతుపవనాలు మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల రాక ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది.
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఈ జిల్లాల్లో పలు చోట్ల 44, 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణాలతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పొలం పనులు తాత్కాలికంగా విరమించుకోవడం ఉత్తమమని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో నేడు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో బాగా వేడిగా ఉండనుంది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు.