మనుషులు- వన్యప్రాణుల మధ్య సంఘర్షణను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు  విఫలమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సిక్కోలు, పార్వతీపురం మన్యం  జిల్లాలో వణ్య ప్రాణుల సంచారం, దాడులు చూసి ప్రజలు బెంబేలేత్తుతున్నారు.  ఓ వైపు గజరాజులు, మరోవైపు ఎలుగుబంట్ల సంచారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో తాజాగా పులి సంచరిస్తోంది. పశువులపై పంజా విసురుతుండడంతో ప్రజలు మరింతగా వణికి పోతున్నారు. ఆయా జిల్లాలో  ఇప్పటికే ఎలుగుబంటి, ఏనుగుల దాడితో చాలా మంది మృతి వాత పడ్డారు. ఏనుగులు ఆ ప్రాంతంలోనే మకాం వేస్తుండడంతో ప్రజలు పండించే పంటలు ప్రతి ఏడాది నష్టపోవడం నిత్యకృత్యమైంది.


శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో ఎలుగు బంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఎవరైనా పొరపాటున తారసపడితే ఆ వ్యక్తికి గాయాలు, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు మకాం వేశాయి. ఎప్పుడు ఎక్కడ ఏ పంటలను నాశనం చేస్తాయే, ఎవరి ప్రాణాలు తీస్తాయోనని ఆందోళన నెలకొంది. ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగుళూరు నుంచి కుంకి ఏనుగులు తీసుకువస్తారని తద్వారా ఆపరేషన్ గజా ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్నారు.




రైతులు సాగుచేసే పంటలను నాశనం చేసినా, వాటికి ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు. ఎలుగు బంట్లు ఉద్దానం ప్రాంతాల్లో అయితే మరింత రెచ్చిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే ఆలయాలకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రోజుకు 60 కిలో మీటర్లుకు తక్కువ లేకుండా పరుగులు పెట్టే పులి తాజాగా టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపడుతుండడంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఏనుగులు, ఎలుగుబంట్లలతో పశువులు, మనుషులు ప్రాణాలు పోయిన సందర్భాలు జిల్లాలో చాలా ఉన్నాయి. అందువల్ల అటవీ అధికారులు వణ్యప్రాణుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.



ఏనుగులతో భయభ్రాంతులకు గురవుతున్న మన్యం ప్రజలు


గత కొంతకాలంగా ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో ఏనుగులు చేస్తున్న హైరానా ఇంతా అంతా కాదు. గిరిజన ప్రాంతాల్లో పోడుగు వ్యవసాయానికి వెళ్తున్న గిరిజనులు కనీసం బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మరో పక్క వచ్చి పోయే వాహనాలు మీద దాడులు చేస్తూ వణికిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే అధికారులు వచ్చి సూచనలు అయితే ఇస్తున్నారు. గాని సరైన సహకారం అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులతో అయితే ఈ ఏనుగులు ఒకచోట నుండి మరొక చోటకు ఇలా ప్రయాణం చేస్తూ మనుషుల మీద, పొలాల మీద దాడి చేయడంతో మన్యం జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.




ఉద్దానంలో ఎలుగుబంట్లు


పచ్చని తివాచీ పరిచినట్లు ఉంటుంది ఆ ప్రాంతం. ఏ చెట్టు పొదల్లో బల్లూకం (ఎలుగుబంటి) ఉందో తెలియదు. ఏ క్షణాన దాడి చేస్తాయో తెలియదు. కనీసం ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. చలికాలం మంచు ఎక్కువగా పడటంతో ఎలుగుబంట్లు సంచారం కూడా పెరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం దేవాలయాలు వద్ద ఎలుగుబంట్లు సంచరించడానికి కారణాలు చెప్పారు. భక్తులు దేవుడి కోసం తీసుకువచ్చే కొబ్బరికాయి అదే విధంగా అరటి పళ్లు, తిను పదార్ధాలు అక్కడ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. వాటి కోసం వచ్చి హడావుడి చేస్తుంటాయి. ఒంటరిగా కనిపించిన వారిపై దాడి చేస్తుంటాయని  అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే బయటికి వెళ్ళేటప్పుడు కూడా గుంపులుగా వెళ్లాలని చెబుతున్నారు.


Also Read: Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్


శ్రీకాకుళం జిల్లా వాసులకు చుక్కలు


గత కొన్ని రోజుల క్రిందట మన్యం జిల్లా నుంచి ఒడిస్సా వైపు వెళ్లిన పెద్దపులి మళ్లీ ఒక్కసారిగా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లోకి రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు శ్రీకాకుళం పరిసర మైదాన ప్రాంతాల్లో పులి సంచరించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ క్షణాన ఇటువైపు వెళ్తాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా వరి కోతలు కోసే సమయం కావడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ పులి మాత్రం ఎప్పుడూ ఎవరి మీద దాడి చేస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు.