AP CM Chandrababu About Belt Shops | రాయదుర్గం: అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీకి 11 సీట్లు రావడంపై సెటైర్లు వేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఏప్రిల్ 11న ప్రతిపక్షనేతగా జిల్లాలోని కణేకల్లుకు వచ్చాను. మళ్లీ ఈరోజు నేమకల్లుకు వచ్చాను. ఆరోజు 11వ తేదీన జిల్లాకు వచ్చినందుకు, మీరు వైసీపీకి అదే నెంబర్ సీట్లు ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు అన్నారు. నేమకల్లులో వృద్ధాప్య పింఛన్, దివ్యాంగురాలికి పింఛన్ సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత నేమకల్లులో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు.
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వితంతు రుద్రమ్మ ఇంటికెళ్లి పింఛను అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను రూ.15 వేలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించారు. మహిళలు, స్కూలు పిల్లలతో సీఎం ముచ్చటించారు.
బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తా: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
గత ప్రభుత్వంలా కాదని, ప్రజల సొమ్మును దోచుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. తాము తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. వైసీసీ హయాంలో వాళ్ల మనుషులను పెట్టి మరీ కల్తీ, నాసిరకం లిక్కర్ ను ఇష్టానుసారం విక్రయించి ప్రజల జేబులు గుళ్ల చేశారని విమర్శించారు. బెల్ట్ షాపులు ఎవరు పడితే వాళ్లు పెడితే తాను బెల్ట్ తీస్తానంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ ఉన్నవాళ్లు మాత్రమే డిపోల నుంచి మద్యం తెచ్చుకుని విక్రయాలు చేయాలన్నారు. అలాకాదని దందాలు చేస్తే నాయకులైనా సరే, వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని నేమకల్లులో నిర్వహించిన గ్రామసభలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా నిధులు
పేదల భూములకు రక్షణ కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. రాయలసీమను మళ్లీ రతనాలసీమ చేస్తాం. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో కనివిని ఏరుగని గెలుపు సాధ్యం చేశారు. 53 శాతం ఓట్లు వేసి 93 శాతం మంది అభ్యర్థులను గెలపించడం చారిత్రాత్మకం. హంద్రీనివా మీద రూ.4500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలో 12,500 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వెచ్చించాం. నేమకల్లుకు సాక్షిగా చెబుతున్నా ఎత్తిపోతల పథకానికి రూ.9000 కోట్లు కేటాయించాం. కచ్చితంగా పనులు పూర్తి చేసి తీరుతాం. మంచి పని చేయాలంటే ఆంజనేయస్వామని దర్శించుకోవాలి. ఈ మంచి పనులు చేయడానికి తనకు శక్తి ప్రసాదించాలని ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రార్థించాను.
ఒకేసారి మూడు నెలల పింఛన్ అందిస్తున్నాం..
నిరుపేదలు, రైతులు, బలహీనవర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పింఛన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రూ.3 వేల నుంచి రూ.4 వేలు చేసి పెండింగ్ మూడు నెలలవి కూడా ఇచ్చాం. ఈ పింఛన్లు రూ.35తో ఎన్టీఆర్ ప్రారంభించారు. చంద్రబాబు రూ.75కు పెంచారు. మళ్లీ సీఎం అయ్యాక 2015 తరువాత రూ.200 నుంచి రూ.2000కు పెంచాను. ఇప్పుడు రూ.3 వేల నుంచి 4 వేలు చేసి అందిస్తున్నాం. రూ.18 వేల కోట్లు పేదవారికి ఇచ్చామంటే నా జీవితం ధన్యమైంది. 64 లక్షల మందికి రూ.2,709 కోట్లు ప్రతినెలా పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా, మూడో నెలలో ఒకేసారి పింఛన్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశామని చంద్రబాబు తెలిపారు.