Andhra Pradesh CM Chandrababu distributes pensions at Nemakallu in Anantapur district | రాయదుర్గం: ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకుగానూ పింఛన్ల పంపిణీని ముందుగానే ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ (NTR Bharosa Pension Scheme) పంపిణీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నెమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులైన రుద్రమ్మ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా అందజేశారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నాక, సీఎం చంద్రబాబు పింఛన్ నగదు రూ.4000 అందజేశారు. రుద్రమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది పిల్లలున్నారు, ఏం చేస్తు్న్నారని పింఛన్ లబ్ధిదారు అయిన పెద్దావిడను అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే తమకు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
అనంతరం ఆ ప్రాంతంలో చిన్నారులతో సరదాగా కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో కేవలం నేమకల్లు గ్రామస్తులు మినహా ఇతరులను అనుమతించడం లేదని ఎస్పీ జగదీష్ తెలిపారు. సీఎం చంద్రబాబు పొల్గొంటున్న గ్రామసభకు ప్రజలు హాజరుకావాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించారు. గ్రామస్తులు మొత్తం సీఎం చంద్రబాబు పాల్గొన్న గ్రామసభకు హాజరయ్యారు. చంద్రబాబు లబ్ధిదారులకు వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నారు.
ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ ప్రారంభం
ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ ను ఆగస్టు 31న ప్రారంభించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి డిసెంబర్ పింఛన్లను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.
ఏపీలో 28 విభాగాలలో లబ్దిదారులకు పెన్షన్..
ఏపీలో మొత్తం 28 విభాగాలలో లబ్దిదారులకు ప్రభుత్వం పెన్షన్ నగదు పంపిణీ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ 1 నుంచి వృద్దులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు,కళా కారులు, మత్స్య కారులు, ట్రాన్స్ జెండర్స్ కు రూ.4000 పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.15000కి పింఛన్ లభిస్తుంది.
Also Read: Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?