Srikakulam SM Puram Residential School News: శ్రీకాకుళం ఎస్ఎంపురం గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ముద్దాడ దిలీప్(15) జలుమూరు మండలం పర్లాంమాకివలస వాసి. మృతిపై తల్లిదండ్రులు వాసుదేవరావు, లక్ష్మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. "ప్రతి రోజు డిన్నర్ పూర్తి చేసిన తర్వాత స్టడీ అవర్ ఉంటుంది. స్టడీ అవర్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు వారి డార్మిటరీలోకి వెళ్లిన తర్వాతే కేర్ టేకర్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు, తిరిగి ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు స్టడీ అవర్‌కు వస్తారు. ప్రిన్సిపల్ క్లాస్ తో వారి దినచర్య ప్రారంభమవుతుంది. శుక్రవారం ప్రిన్సిపల్ గణస్వామి స్టడీ అవర్ తీసుకునే టైంకు దిలీప్ రాలేదు. " అని చెప్పారు.
దిలీప్ రాలేదని తెలుసుకున్న ప్రిన్సిపల్... దిలీప్ ఎందుకు రాలేదని తోటి విద్యార్ధులను ప్రశ్నించారు. వెంటనే తీసుకురావాలని విద్యార్థులను పురమాయించారు. దీంతో దిలీప్‌ను తీసుకురావడానికి స్నేహితులు వెళ్లారు. తన రూమ్‌లో లేడు. తరగతి గదుల్లో వెతికారు అక్కడ కూడా లేడు. చివరికి డార్మిటరీ వెలుపల వేలాడుతూ కనిపించాడు. సన్‌సైడ్‌కు ఉన్న హుక్‌కు నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు కంగారుపడి విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పారు అని తల్లిదండ్రులకు స్కూల్ సిబ్బంది చెప్పారు.
సమాచారం తెలిసిన వెంటనే ప్రిన్సిపల్ పాఠశాల పేరెంట్ కమిటీ ఛైర్మన్‌కు, ఎచ్చెర్ల పోలీసులకు, దిలీప్ కన్నవారికి సమాచారం చేరవేశారు. వారితోపాటు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా స్కూల్‌కి వచ్చారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి కారణాలపై పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు తల్లిదండ్రులు, అధికారులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కూడా మాట్లాడి పూర్తి వివరాలు అందజేశారు.
మృతుడి తల్లిదండ్రులకు రూ.10వేలు ఆర్ధిక సాయాన్ని అందించారు ఎమ్మెల్యే . ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. స్పాట్‌ను ఆర్డీవో, డీఈవో, తహసీల్దారు, సీఐ అవతారం, ఎచ్చెర్ల ఎస్ఐ పరిశీలించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Also Read: అప్రమత్తంగా లేకుంటే ఉద్యోగానికి ముప్పే- శ్రీకాకుళం జిల్లా అధికారులకు ఝలక్ ఇచ్చిన కలెక్టర్, ఎస్పీ
సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎస్ఎఫ్ఎ
విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్ఎఫ్ఎ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడి తల్లిదండ్రులతో ఎస్ఎఫ్ఎ నాయ కులు మాట్లాడారు. గతంలో పాఠశాలలో అనేక మంది విద్యార్ధులు మృతి చెందినట్టు తెలిపారు. ఈ నెల ఒకటిన దిలీప్‌ను తల్లి కలిసి మాట్లాడిందన్నారు. గతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఈ విద్యార్థి సాక్ష్యం చెప్పాడని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఎఫ్ఎ నాయకులు గతంలో అనేక మంది విద్యార్ధులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని వివరించారు. గురుకుల పాఠశాలలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలా జరగ డానికి కారణమేమిటో సమగ్ర దర్యాప్తు చేయాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Also Read: కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు