Free Army School Coaching Centre Frauds In Srikaulam : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్మీ కాలింగ్ సెంటర్ పేరుతో విద్యార్థులకు చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిరుద్యోగ యువతను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయించుకొని చిత్రవధ చేస్తున్న రమణ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అభ్యర్థులను రాచిరంపాన పెడుతున్న వైనం ఇప్పుడు బహిర్గతమైంది.  


వెంకట రమణ పేరుకే కోచింగ్ ఉచితమని ప్రకటనలు చేస్తారు. అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని అంటున్నారు. అంతే కాకుండా తన సొంత పనులు కూడా వారితో చేయించుకుంటారని అభ్యర్థులు అంటున్నారు. వెంకటరమణ కాళ్ళు నొక్కాల్సి ఉంటుంది. అలా ఎవరైనా చేయకుంటే వారిని చిత్రవధ చేస్తారు.  


ఈ మధ్య వెంకటరమణ కాళ్లు పట్టుకునేందుకు అభ్యర్థి నిరాకరించాడు. అంతే ఆయనకు కోపం వచ్చింది. బెల్ట్‌తో కొడుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. అక్కడే ఉన్న అభ్యర్థుల్ల ఒకరు ఈ వీడియో తీసి మీడియాకు లీక్ చేశారు.  




ఇక్కడితో వెంకటరమణ ఆగడాలు ఆగిపోలేదు... జిల్లా నాయకులకు సెక్యూరిటీ ఇస్తానంటూ అభ్యర్థులను అక్కడి కూడా పంపస్తాడు. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా సాగిపోయిన రమణ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. స్వచ్ఛంద సేవ పేరుతో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న రమణ అరాచకాలు జిల్లాలో హాట్‌టాపిక్ అయ్యాయి.  


ఆర్మీలో చేరాలనే కోరిక ఉన్న వాళ్లు ఉత్తరాంధ్రలో వేల మంది కనిపిస్తారు. ముఖ్యంగా శ్రీకాకుళ జిల్లాల వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.  అలాంటి వారంతా ఉద్యోగాల సాధన కోసం కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవుతుంటారు. ఆర్థిక స్తోమత లేని వాళ్లు ఇంటి వద్దే ఉంటూ సీనియర్ల సలహాలో తర్ఫీదు పొందుతూ ఉంటారు. అలాంటి  వారందరిని బుట్టలో వేసుకొని ఫ్రీకోచింగ్ అంటూ వెంకటరమణ తీసుకొస్తుంటాడు.