AP INTER EXAMS: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల(Inter exams) నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మార్చి 1 నుంచి 20వ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా.. అంటే ఫిబ్రవరి 1,3 తేదీల్లో మానవ విలువలు-నైతికత (Human Values and Ethics) పరీక్షలు, మార్చి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఇంటర్ పరీక్షలకు షెడ్యూలును అధికారికంగగా ప్రకటించనున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం కావాలని ఇంటర్‌బోర్డు అధికారులు సూచించారు. ఈ మేరకు బోర్డు పరిధిలోని కళాశాలలను పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇంటర్ బోర్డు అప్రమత్తం చేసింది. పరీక్షల్లో ప్రతిభ చూపి ఎక్కువ మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు. 


ఫీజు చెల్లింపునకు 15 వరకు అవకాశం..
ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు పొడిగించారు. ఇంటర్‌ (జనరల్‌, ఒకేషనల్‌) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులు, ప్రైవేట్‌ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలి. విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి ఇదే చివరి అవకాశం.


వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్..
ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్‌‌ను అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ సిలబస్‌ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. 


12 ఏళ్లుగా పాత సిలబస్సే..
రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్మీడియట్‌లో మాత్రం దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్‌నే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ విద్యా విధానంలో భాగంగా.. వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు  పాతబడిపోవడం, సైన్స్‌ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్‌డేట్‌ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్‌ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. 


పరీక్షల విధానంలోనూ మార్పులు..
ఇంటర్‌ బోర్డు కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరగానే కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. అదేవిధంగా యూనిట్‌ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారుచేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్‌ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్‌ టెస్ట్‌ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్‌ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్‌ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్‌ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.


ALSO READ:


తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - చివరితేదీ ఎప్పుడంటే?


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...