Guntur News: అతనో ఆటో డ్రైవర్. సంపాధించిన కొద్ది మొత్తంతోనే ఇంటిని నెట్టుకొస్తున్నాడు. కానీ పిల్లలతో పాటు భార్యను కూడా చదివిస్తున్నాడు. ఆయన కష్టాన్ని, తనపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని అర్థం చేసుకున్న ఆమె కష్టపడి చదివింది. పీహెచ్డీ పూర్తి చేసింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం పీహెచ్డీ పట్టా అందుకోనున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన ఈపూరి షీల డిగ్రీ చదువుతున్న సమయంలోనే పెళ్లి జరిగింది. 2003వ సంవత్సరంలో ఆటో డ్రైవర్ అయిన కరుణాకర్ తో తల్లిదండ్రులు వివాహం చేసి పంపించారు. అయితే ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తి గమనించిన ఆమె భర్త ఆమెను చదివించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం వీరికి ఇంజినీరింగ్ చదువుతున్న బాబు, ఇంటర్ చదువుతున్న పాప ఉన్నారు. ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బుతోనే పిల్లలతో పాటు భార్యను కూడా చదివించాడు. వీళ్ల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు.
ఈక్రమంలోనే "ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత" అనే అంశంపై షీల పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం పీహెచ్డీ పట్టా అందుకోనున్నారు. ఆమె గైడ్ డాక్టర్ నంబూర్ కిషోర్ వద్ద ఈ పీహెచ్డీని పూర్తి చేశారు. అయితే తాను ఈరోజు ఏం సాధించినా అది తన భర్త ఘనతే అని షీల చెబుతున్నారు. డిగ్రీ తర్వాత రెగ్యులర్ విధానంలో ఎంకామ్ చేసి, తర్వాత దూర విద్య ద్వారా ఎంహెచ్ఆర్ఎమ్ పూర్తి చేసింది షీల. ఆ తర్వాత ఏపీ సెట్ క్వాలిఫై అయింది. ఆ తర్వాతే పీహెచ్డీ అందుకోవాలనుకొని దాని కోసం కృషి చేసింది. ప్రభుత్వ అధ్యాపకురాలు కావాలన్నది తన లక్ష్యం అని... ప్రస్తుతం తెనాలిలోని వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో కామర్స్ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.
ఇటీవలే రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన కూలీ
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. నిత్యం కూలి పనులు చేసి భారతి డాక్టర్ అయ్యింది. రసాయన శాస్త్రంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురు కలిసి వచ్చింది భారతి. పారగాన్ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలసైతం ప్రత్యేక గౌరవం ఇచ్చారు. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేసింది. తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది.
తన కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు.