Former AP Minister Perni Nani | గన్నవరం: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలపై, పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శలు గుప్పించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్ లో వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. శనివారం నాడు గన్నవరం సబ్ జైల్ కు వెళ్లి రిమాండ్ లో ఉన్న నలుగురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో వైసీపీ కార్యాలయం పైకి విజయవాడ నుంచి వచ్చిన కొందరు రెచ్చగొట్టేలా చేశారు. వారి చర్యలతో ఆత్మరక్షణ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన చర్యలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని పేర్నినాని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు, జగన్ సానుభూతిపరులన్న కారణంగానే వారిపై సంబంధం లేని విషయాలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుక, లే ఔట్ లపై దృష్టి పెట్టింది.
తప్పుడు కేసులతో అంతా భయపడుతున్నారు!
ఏపీలో అధికారం తమ చేతుల్లో ఉందన్న కారణంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులను 7 నుంచి 71 వరకు పెంచారు. ఈ కేసులో ఏ71గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరును పోలీసులు చేర్చారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే అక్రమ కేసుల్లో అరెస్టైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించారు. జగన్ ఆదేశాలతో నూజివీడులో ఉన్న 15 మందిని, అదే విధంగా గన్నవరం సబ్ జైల్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించాం. ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభివృద్ధి, సంపద సృష్టించేలా కనిపించడం లేదు.
టీడీపీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైన వారిని, అక్రమ కేసులు నమోదైన వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. వైసీపీ జెండా మోసే కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ సూచించారు. గన్నవరంలో వైసీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. వల్లభనేని వంశీ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ కేసుల నుంచి బయటపడేందుకు, చట్టపరమైన హక్కులు వినియోగించుకుంటూ కోర్టును ఆశ్రయించారు. దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు’ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
Also Read: బొత్సకు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి - ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కూటమి కసరత్తు