MLC Elections : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్‌సీపీ తరపున అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేశారు. కూటమి కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అనకాపల్లి టీడీపీ నేత పీలా గోవింద్ సత్యనారాయణతో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బొత్సను ఢీ కొట్టగలిగిన అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. బొత్సను అభ్యర్థిగా వైసీపీ చేయడంతో .. తెలుగుదేశం పార్టీ ఉత్తారంధ్ర నేతలు విశాఖలో సమాలోచనలు చేశారు. పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో చర్చించారు. పలువురు పేర్లను హైకమాండ్‌కు పంపనున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున వంశీ కృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. అందుకే గతంలో టీడీపీ పోటీ పెట్టలేదు . కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. వైసీపీ ద్వితీయ శ్రణి క్యాడర్ అంతా పక్క చూపులు చూస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అయిన .. స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పార్టీ మారిపోతున్నారు. ఎన్నికలకు ముందు కొంత మంది..ఎన్నికల తర్వాత కొంత మంది పార్టీ మారిపోయారు. దీంతో వైసీపీ బలం ఎంత అన్నది స్పష్టత లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ కారణంగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం అంత తేలిక కాదని భావిస్తున్నారు.
అధికార పార్టీగా ఉన్న టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని తెలియడంతో.. జగన్ వ్యూహాత్మకంగా అత్యంత సీనియర్ నేత అయిన బొత్సకు సీటిచ్చారని అంటున్నారు. బొత్స కుటుంబం ఉత్తరాంధ్రలో కీలక రాజకీయ కుటుంబం. అయితే గత ఎన్నికల్లో ఆయన కుటుంబం మొత్తం ఓడిపోయింది. విశాఖ లోక్ సభకు పోటీ చేసిన బొత్స సతీమణి దాదాపుగా ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి.. ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్య.. గజపతి నగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలి సారిగా ఆయన ఇంట్లో ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు.
ఘోరమైన ఓటముల తర్వాత ఇప్పుడు మరోసారి బొత్సకు పోటీ చేసే అవకాశం వచ్చింది. రెండు నెలల్లోనే ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావడంతో తన చాణక్యంతో గెలిచి ఆయన ప్రజాప్రతినిధి అవుతారని వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమినేతలు మాత్రం.. వైసీపీ ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని.. తమ పార్టీకే ఓటు వేస్తారని నమ్మకంతో ఉన్నారు. అందుకే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికే తమ ఓటర్లను క్యాంపులకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.