Telugu Desam : సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స చేశారు. ఎంపీ కేశినేని నాని జన్మదిన వేడుకలు తన ఆఫీస్‌లో నిర్వహించిన ఆయన... తనకు అండగా ఉంటాలంటూ విజయవాడ ఎంపీకి రిక్వస్ట్ చేశారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్న వారిలో తాను ముందు వరసలో ఉంటానని చెప్పుకొచ్చారు బుద్దావెంకన్న. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి లేకపోవడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదని అభిప్రాయపడ్డారు. నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానని అన్నారు.
రాష్ట్రంలో సీఐల ట్రాన్సఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని ఆరోపించారు బుద్ద వెంకన్న. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారని అన్నారు. ఈ విషయంలో తన మాట చెల్లుబాటు కాలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదని తనే ఇతరులపై ఆధారపడి పనులు చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు ఏం చేయలేనని క్షమించాలని వేడుకున్నారు
2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్ర పటం కాళ్ళు కడిగానని వెంకన్న గుర్తు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదన్‌నారు. చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ వెళ్తే అడ్డంగా నిలబడ్డానని ఇప్పుుడ గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుుడ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిందెవరో చెప్పాలన్నారు.
ఐదేళ్ల వైసిపి పాలనలో అనేక పోరాటాలు చేశానని తెలిపారు వెంకన్న. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను దీటుగా ఖండిస్తూ వచ్చానని చప్పుకొచ్చారు. దీని వల్ల తనపై మొత్తం 37 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఆ కేసులన్నీ టిడిపి కోసం చేసిన పోరాటంలో పెట్టినవేనన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదన్నారు. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదని తెలిపారు.
గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టిడిపిలో టికెట్లు పొందారని వెంకన్న వివరించారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల తర్వాత తెలుసుకున్నట్టు అభిప్రాయపడ్డారు. నమ్ముకున్న కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానని ఆందోళన చెందారు.
2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా అన్నారు బుద్ద వెంకన్న. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానన్నారు. తాను చనిపోయే వరకు టిడిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ కేసినేని చిన్ని మూడుసార్లు ఎంపీగా గెలవడం ఖాయమన్నారు బుద్దా. కేశినేని నాని లాగా కేశినేని చిన్ని మాటల మనిషి కాదని చేతల మనిషి అంటు కితాబు ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక బాధ్యతలు కేశినేని చిన్నిపై చంద్రబాబు నాయుడు పెట్టారంటే ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుందని వివరించారు. తన ఆవేదనను కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని రిక్వస్ట్ పెప్టారు. అనంతరం మాట్లాడిన కేశినేని చిన్ని.. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బిజెపికి ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారనేది నిజమేనన్నారు. ఆ విషయం నాకు తెలుసని చెప్పారు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్తానన్నారు. త్వరలోనే బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాకు మంచి పదవులు వస్తాయి శుభవార్త చెప్పారు. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.