Pawan Kalyan Visits Book Fair In Vijayawada | విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పుస్తకాలంటే ప్రేమ. తాను ఎన్నో వేల పుస్తకాలు చదివానని, వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాను, స్ఫూర్తి పొందానని స్వయంగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో ప్రస్తావించడం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం విజయవాడ బుక్ ఫెయిర్ ను సందర్శించారు. పలు పుస్తక కేంద్రాలకు వెళ్ళి దాదాపు రెండున్నర గంటలపాటు పుస్తకాలు కొనుగోలు చేశారు.
రూ.5 లక్షల బుక్స్ కొనుగోలు
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు దాదాపు రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలను పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్య పుస్తకాలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను పెద్ద మొత్తంలో ఆయన కొన్నారని తెలుస్తోంది. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకూ పలువురు రాసిన సాహిత్య, స్ఫూర్తిదాయక రచనలను ఆయన కొనుగోలు చేశారు. ప్రాచీన సాహిత్యంపై విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలతో పాటు ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చిన అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక రచనలు పరిశీలించిన పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను పిఠాపురంలో భారీ గ్రంథాలయం ఏర్పాటు చేసి అందులో వీటిని ఏర్పాటు చేసి పాఠకులకు అందుబాటులో ఉంచుతారని సమాచారం.
ఆ బుక్ చూసి పవన్ కళ్యాణ్ హర్షం
తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకాన్ని చూసి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. డా. విక్టర్ ఈ.ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి ఆశావాద భావన కలుగుతుందన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన హిట్లర్ నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ జీవితాన్ని నిలుపుకున్నాడో ఆ రచనలో ఉందని తెలిపారు. ప్రముఖులకు పుస్తకాలు బహుమతి ఇవ్వడానికి ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలు కొనుగోలు చేస్తుంటారని పవన్ పేర్కొన్నారు.
అదే విధంగా మన దేశ చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, భారతీయ చట్టాలు, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలు కొనేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, బుక్ ఫెయిర్ నిర్వాహకులు ఎమెస్కో విజయ్ కుమార్, లక్ష్మయ్య, బాబ్జీ, టి మనోహరనాయుడు తదితరులు ఉన్నారు. వీరు పవన్ కళ్యాణ్ కోరిన పుస్తకాలను చూపించేందుకు ఆయా పుస్తక స్టాల్స్‌కు తీసుకెళ్లి బుక్స్ కొనుగోలును సులభతరం చేశారు.