Vande Bharat: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ కోచ్‌లు 16కు పెంపుSouth Central Railway (SCR) | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో పరుగులు పెడుతున్న వందే భారత్ లలో సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య సేవలు అందిస్తున్న రైలు ఒకటి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ - విశాఖపట్నం - హైదరాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) లో కోచ్‌లను 8 నుంచి 16కు పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య 530 కాగా, ఇక నుంచి సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో సీట్లు సంఖ్య 1,128కి పెరగనుందని రైల్వే అధికారులు ప్రకటించారు.
సోమవారం నుంచి అందుబాటులోకి మరిన్ని సీట్లు
జనవరి 13 (సోమవారం) నుంచి అదనపు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గత ఏడాది ఈ వందే భారత్ పట్టాలెక్కింది. 2024 మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ రైలును ప్రారంభించడం తెలిసిందే. జనవరి 12 వరకు ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ 1 కోచ్ ఉండగా, ఛైర్‌కార్ కోచ్‌లు 7 ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఈ వందే భారత్ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2కి పెరగగా, ఛైర్‌కార్ కోచ్‌లు రెట్టింపయి 14 కానున్నాయని ద.మ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో సీట్ల సంఖ్య 104కు చేరగా, చైర్‌కార్ కోచ్‌లలో సీట్ల సంఖ్య 1024కి పెరగనుడటం సంక్రాంతి రద్దీ సమయంలో పండుగ లాంటి వార్తే. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 15 అదనపు రైళ్లు, అదనపు కోచ్‌లతో సేవలు అందించనున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
విశాఖకు వెళ్లే వారికి ఊరట
అసలే సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ నుంచి విశాఖ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నవేళ రైల్వే శాఖ నిర్ణయం అటువైపు వెళ్లే వారికి శుభవార్త అని చెప్పవచ్చు. రెగ్యూలర్ టికెట్ ధరలతో పోల్చితే ట్రావెల్స్ బస్సుల్లో మూడు రెట్లు అధిక ధరలు తీసుకుంటున్నారని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అలాగని విమానంలో ప్రయాణించే ఆర్థిక స్థోమత వారికి సరిపోదు. దాంతో రైళ్లే వారికి ప్రత్యామ్నాయం. అయితే నవంబర్ కు ముందే సంక్రాంతి సమయానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ పూర్తి కావడంతో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్- ఊరెళ్లే రహదారులన్నీ జామ్